Best Tips For Get Rid of Spectacles :చాలా మంది కళ్లద్దాలు రాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడమెలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు కొన్ని నేచురల్ టిప్స్ ఫాలో అయ్యారంటే.. కంటి(Eyes)ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భవిష్యత్తులో కళ్లద్దాలు రాకుండా జాగ్రత్తపడవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీవనశైలి మార్పులు : ముఖ్యంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే.. కొన్ని జీవనశైలి అలవాట్లలో మార్పులు చేసుకోవాలని హైదరాబాద్ కామినేని హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ జయపాల్ రెడ్డి సూచిస్తున్నారు. ఈ అలవాట్లు కేవలం కంటి ఆరోగ్యానికి మాత్రమే కాదు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా మీ డైలీ డైట్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడం కోసం డైలీ తగినంత వాటర్ తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుందని డాక్టర్ జయపాల్ రెడ్డి చెప్పారు.
స్క్రీన్ సమయాన్ని తగ్గించడం :మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని.. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం. ఎందుకంటే ముఖ్యంగా డిజిటల్ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా వివిధ కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ జయపాల్ రెడ్డి సూచిస్తున్నారు. అలాగే.. 2020లో 'ఆక్యుపేషనల్ హెల్త్ జర్నల్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. స్క్రీన్ టైమ్ రోజులో రెండు గంటలకు పరిమితం చేయడం కంటి అలసట, దృష్టి ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని వెల్లడైంది.
స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లో ఈ సెట్టింగ్స్ మార్చితే మీ కళ్లు సేఫ్!
20-20-20 రూల్‌ను పాటించడం : ఈ రూల్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని కంటి వైద్యులు జయపాల్‌రెడ్డి సూచిస్తున్నారు. దీని ప్రకారం.. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి. ఈ రూల్‌ను క్రమంతప్పకుండా పాటించడం వల్ల కంటి ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చంటున్నారు వైద్యులు. దీనితో పాటు కొన్ని స్క్రీన్ మీద గడిపేవారు రెప్పవేయడం, తదేకంగా చూడటం వంటి కొన్ని కంటి వ్యాయామాలు చేయడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు.