Best Time To Drink Milk :మనం హెల్దీగా ఉండటానికి రోజూ సమతుల ఆహారంతోపాటు, ఒక గ్లాసు పాలను తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు,ఖనిజాల వంటివి పుష్కలంగా ఉన్నాయని సూచిస్తున్నారు. అందుకే పాలను సంపూర్ణ పోషకాహారంగా పరిగణిస్తారు. అయితే.. చాలా మందికి ఉదయాన్నే పాలు తాగడం అలవాటు ఉంటుంది. మరికొంత మంది పడుకునేముందు తాగుతారు. మరి.. పాలలోని పోషకాలన్నీ శరీరానికి అందాలంటే ఏ సమయంలో తాగాలో మీకు తెలుసా?
పోషకాలు అనేకం :
పాలలో విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజూ తాగడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పాలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నిపుణులు అభిప్రాయం ప్రకారం రాత్రి పడుకునే ముందు పాలనుతాగడం వల్ల కంటి నిండా నిద్ర పడుతుందని చెబుతున్నారు. అలాగే మన శరీరం పాలలో ఉండే కాల్షియం స్థాయిలను రాత్రి సమయంలో తాగడం వల్ల అధికంగా గ్రహిస్తుందని తెలియజేస్తున్నారు. రాత్రి పడుకునే ఒక అరగంట ముందు పాలు తాగడం మంచిదని సూచిస్తున్నారు. కొంత మంది పాలు తాగిన వెంటనే నిద్రపోతుంటారు. కానీ, ఇలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? - ఇప్పుడే చెక్ చేసుకోండిలా!
అలాగే మరికొంత మంది ఖాళీ కడుపుతో పాలను తాగితే మంచిదని పరగడుపున తాగుతుంటారు. కానీ.. ఇది కేవలం అపోహ మాత్రమేనట. అంతేకాదు.. ఇలా తాగడం ఇబ్బంది కూడా కలిగిస్తుందట. పరగడుపున పాలను తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. పిల్లలకు మాత్రం పాలను ఎప్పుడైనా అందించవచ్చని, ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేస్తున్నారు.