Urinary Dribble in Older Men: సాధారణంగా వయసు పైబడుతున్నా కొద్దీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అందులో తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కూడా ఒకటి. అయితే, మగవారిలో మూత్రవిసర్జన చేసిన కొద్దిసేపటి తర్వాత కూడా మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంటుంది. అలాగే నవ్వినా, దగ్గిన కూడా ఇలాంటి సమస్య ఇబ్బంది పెడుతుంది. అయితే, ఇలా మూత్రం లీక్ కావడానికి కారణాలు ఏంటి ? ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా పురుషులలో వయసు పెరుగుతున్నా కొద్దీ మూత్రనాళానికి చుట్టూరా కరచుకొని ఉండే ప్రోస్టేట్ గ్రంథి వాపు వస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బినప్పుడు మూత్రనాళ మార్గం సంకోచిస్తుంది. దీనివల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా మూత్ర విసర్జన ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని చుక్కలు దుస్తుల్లో పడతాయి. దీన్నే వైద్య పరిభాషలో 'పోస్ట్-మిక్చ్యురిషన్ డ్రిబ్లింగ్' (Post-Micturition Dribble/PMD) అంటారని నిపుణులు అంటున్నారు.
కారణాలు ఇవే: పురుషులలో మూత్రం లీకేజీ కావడానికి ప్రోస్టేట్ గ్రంథి, మూత్రాశయం లేదా మూత్రాశయ నాళం వంటి సర్జరీలు ఓ కారణం కావచ్చని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఎడిటర్ డాక్టర్ హోవార్డ్ ఇ. లెవైన్ (Howard E. LeWine) చెబుతున్నారు(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). అలాగే ఇతర కారణాలు కూడా ఉండచ్చని అంటున్నారు. పురుషులలో వయసు పెరిగే కొద్దీ మూత్రాశయం చుట్టూ ఉండే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ బలహీనపడతాయి. దీనివల్ల మూత్ర విసర్జన తర్వాత కూడా లీకేజీ ఇబ్బంది పెడుతుందని తెలుపుతున్నారు. వృద్ధులలో ఫిట్‌గా ఉన్నవారిలోనూ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ బలహీనపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇలా చేస్తే లీకేజీ సమస్యకు చెక్ పెట్టచ్చు!
- పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడానికి కొన్ని రకాల వ్యాయామాలుంటాయని.. వీటిని నిపుణుల పర్యావేక్షణలో సాధన చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.
- అలాగే అధిక బరువుతో బాధపడేవారు మంచి ఆహారంలో మార్పులతో పాటు, వ్యాయామాలు చేసి వెయిట్ లాస్ అవ్వాలని.. దీనివల్ల మూత్రం లీకేజీ సమస్య కొంత వరకు తగ్గుతుందని చెబుతున్నారు.
- స్మోక్ చేసే అలవాటు ఉంటే మానేయాలంటున్నారు.
- ప్రోస్టేట్ గ్రంథి వాపు కారణంగా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. కాబట్టి, సంబంధిత వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : మీ మూత్రం దుర్వాసన వస్తోందా? - కారణం ఏంటో మీకు తెలుసా?
వెంటనే బాత్రూమ్కు పరిగెత్తాల్సివస్తోందా? - కారణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి!