Trump H1B Visa Program : హెచ్1బీ వీసాల విస్తరణపై అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారింది. గతంలో హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌ను వ్యతిరేకించిన ట్రంప్, తాజాగా దానికి మద్దతు ప్రకటించారు. హెచ్1బీ వీసా విస్తరణను ఒక గొప్ప కార్యక్రమంగా అభివర్ణించిన ట్రంప్, ముందు నుంచి తాను దీనికి అనుకూలంగానే ఉన్నానని తెలిపినట్లు న్యూయార్క్ పోస్టు పేర్కొంది.
వైఖరి మారింది!
తొలిసారి అధికారం చేపట్టినప్పుడు హెచ్1బీ వీసాలపై ఆంక్షలు విధించిన ట్రంప్, అవి దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. ఈ హెచ్1బీ వీసాల వల్ల అమెరికాపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అమెరికన్ కార్మికుల స్థానంలో విదేశీ ఉద్యోగులకు తక్కువ జీతం ఇస్తూ భర్తీ చేయడానికి కంపెనీలు హెచ్1బీ వీసాలను సాధనంగా ఉపయోగిస్తున్నాయని విమర్శించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సవాళ్లకు ప్రతిస్పందనగా 2020లో హెచ్1బీ వీసాల జారీపై మరింత కఠినతరమైన ఆంక్షలు కూడా విధించారు. అయితే హెచ్1బీ వీసాల విస్తరణపై ట్రంప్ మద్దతుదారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుండగా, రిపబ్లికన్ పార్టీలోని మరికొందరు అమెరికా ఫస్ట్ కే జైకొడుతున్నారు.
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్-మగా
భారత్ వంటి దేశాల నుంచి నిపుణులైన వారిని నియమించుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్-మగాకు మద్దతిస్తున్న నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని వారు వాదిస్తున్నారు. ఇమిగ్రేషన్ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయని ఆరోపిస్తున్నారు. ట్రంప్‌నకు అత్యంత నమ్మకమైన మద్దతుదారులైన లూమర్, ఆన్ కౌల్టర్, మాజీ కాంగ్రెస్ సభ్యుడు మాట్ గేట్జ్ వంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాన్ మస్క్, రామస్వామి అమెరికన్ కార్మికులను అణగదొక్కారని ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీలోని కీలక నేత నిక్కీ హేలీ సైతం వివేక్ రామస్వామి వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. అమెరికన్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అమెరికా సంస్కృతిలో ఎటువంటి లోపం లేదని అన్నారు.