Land registration value in Andhra Pradesh : వచ్చే ఏడాదిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా అందించాల్సిందింగా అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లిలోని ఐజీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
భూమి రేట్లు ఎక్కువగా ఉన్న చోటనే : గత వైసీపీ ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకోంటుందని, ఈ క్రమంలో రాష్ట్రానికి రెవెన్యూ (ఆదాయం) కూడా అవసరమని, ఈ నేపథ్యంలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామని వెల్లడించారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును క్రమ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా పెంచుకుంటూ వెళ్లిందన్నారు. దీంతో చాలా చోట్ల భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.
అత్యధికంగా భూ సమస్యలే : భూమి విలువ ఎక్కువగా లేని చోట్ల ఛార్జీలను తగ్గిస్తామని చెప్పారు. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారి కానుందని చెప్పారు. డిమాండ్ ఉన్న చోట విలువలు సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించినవే వస్తుండగా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోనూ దాదాపుగా 10 శాతం వరకు గ్రీవెన్స్‌లో వస్తున్నాయని చెప్పారు. వీటిన్నింటినీ పరిష్కరించే దిశగా తాము కసరత్తు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
మా టార్గెట్‌ను చేరుకుంటాం : గత ఏడాదితో పోల్చితే గడిచిన ఆరు నెలల్లో సెప్టెంబర్ మాసం మినహాయిస్తే తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ రిజిస్ట్రేషన్ల ద్వారా ఆ శాఖకు అదనపు ఆదాయం సమకూరిందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి తాము టార్గెట్‌గా పెట్టుకున్న రూ. 9,500 కోట్ల లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తన స్వార్ధం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను చాలా ఇబ్బందులు పెట్టారని అన్నారు. కానీ తమ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం వారితో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పారు.
భూ వివాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా స్థానికంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ఇప్పటికి లక్షా 70 వేల ఫిర్యాదులు రాగా వాటిలో సుమారుగా 11 వేల ఫిర్యాదులను అక్కడిక్కడే పరిష్కరించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తోపాటు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోదియా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ శేషగిరిబాబు పాల్గొన్నారు.
సర్కార్‌కు షాక్, పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం - హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా?