Best Fruits for Diabetic Patients: షుగర్ బాధితులు పండ్లు తినే విషయంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని పండ్లలో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే.. ఏ పండు తింటే షుగర్ పెరుగుతుందో అనే భయంతో వాటి జోలికి వెళ్లరు. అయితే అలాంటి వారు ఏ సంకోచమూ లేకుండా ఈ పండ్లు తినవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బెర్రీలు:బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయని.. ఇవి రెండూ షుగర్‌ను తగ్గించడానికి మంచివని నిపుణులు అంటున్నారు. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు, బ్లాక్‌బెర్రీలు వంటి అన్ని రకాల బెర్రీలు డయాబెటిస్ పేషెంట్లకు మంచివని చెబుతున్నారు. ఉదాహరణకు.. రాస్బెర్రీ చూసుకుంటే.. 100 గ్రాముల రాస్బెర్రీలలో కేవలం 4.4 గ్రాముల చక్కెర ఉంటుందట. షుగర్ ఉన్నవారికి ఇది మంచిదని చెబుతున్నారు. అలాగే ఇందులోచాలా తక్కువ క్యాలరీలుంటాయి. అంతేకాకుండా మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్‌తో బాధపడుతున్న వారు రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు.
షుగర్ బాధితులు - రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?
సిట్రస్ ఫ్రూట్స్ : నారింజ లేదా బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి కంటెంట్ అధికంగా.. ఇదే కాకుండా ఎన్నో రకాల పోషకాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సిట్రస్ పండ్లలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటిలో చక్కెర చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. కాబట్టి, మధుమేహంతో బాధపడే వారు వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.
అవకాడో :అవకాడలో విటమిన్ సి, ఇ, కె, బి వంటివి పుష్కలంగా ఉన్నాయని.. ఇవి మనల్ని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే వీటిని రోజూ డైట్‌లో తీసుకోడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఇంకా రక్తపోటు కూడా అదుపులో ఉంటుందట. సగం అవకాడోలో కేవలం 0.66 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుందని.. కాబట్టి, డయాబెటిక్ పేషెంట్లు వీటిని డైలీ తినడం మంచిదని సూచిస్తున్నారు.
2018లో డయాబెటిస్ కేర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తులలో రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో అవకాడోలు ప్రభావవంతంగా ఉంటాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ప్రొఫెసర్ డేవిడ్ జె. లెవిన్, MD పాల్గొన్నారు.