Best Dry Fruits For Weight Loss : నేటి రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దాన్ని తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వాకింగ్, జిమ్‌కి వెళ్లడం చేస్తే.. మరికొందరు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు. ఇంకొందరైతే డైటింగ్ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకుంటుంటారు. అయితే, ఇకపై అలా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేకుండా.. మీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు(Weight)తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, బరువు తగ్గడానికి, కంట్రోల్లో ఉండడానికి తోడ్పడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాదం :బరువు తగ్గడానికి బాదంపప్పులు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటిలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా వీటిని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు బాదంను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం మంచిదంటున్నారు.
2003లో "International Journal of Obesity"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆరు వారాల పాటు రోజుకు 50 గ్రాముల బాదం పప్పులు తిన్న వ్యక్తులు తమ శరీర బరువులో 1.36 పౌండ్లు (0.62 కిలోలు) కోల్పోయారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని డెవిస్లో ఉన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జోయెల్ న్యూమన్ పాల్గొన్నారు. బరువు తగ్గించడంలో బాదంలోని పోషకాలు చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఎండు ద్రాక్ష : ఇవి కూడా వెయిట్ మేనేజ్మెంట్లో ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఎండు ద్రాక్షలో సహజమైన చక్కెరలు, ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు చాలా బాగా సహాయపడతాయంటున్నారు. వీటిని నానబెట్టి తింటే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు.
వాల్‌నట్‌లు : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వాల్‌నట్‌లు చేర్చుకోవడం కూడా బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడతాయని చెబుతున్నారు.