These Habits Can Damage Brain Health :మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పార్ట్.. బ్రెయిన్. అది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా సక్రమంగా చేయగలుగుతాం. అంతటి ముఖ్యమైన బ్రెయిన్ ఆరోగ్యం.. కొన్ని అలవాట్ల కారణంగా ఎవరికి వారే దెబ్బ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. మరి.. బ్రెయిన్‌ను(Brain) దెబ్బతీసే ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చక్కెర : చక్కెర ఉండే ఫుడ్స్ ఎంత తీసుకుంటే.. మెదడుపై అంత ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ హెచ్చుతగ్గులకు చక్కెర కారణమవుతుందని.. వాపు, ఇన్సులిన్ నిరోధకత వంటి పరిస్థితులకు కారణమవుతుందని అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ కలిసి మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
2016లో "అల్జీమర్స్ డిసీజ్ ఎండ్ డెమెన్షియా" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక చక్కెర ఆహారాన్ని తినే వ్యక్తులలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూకేలోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయంలో పనిచేసే న్యూరోసైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ మైఖేల్ మోస్ పాల్గొన్నారు. అధిక చక్కెర వినియోగం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
కెఫెన్ : ఇది కూడా మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అధిక కెఫెన్ వినియోగం మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా బ్రెయిన్ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే, కెఫెన్ వినియోగం నిద్ర సమస్యలకు దారితీస్తుందంటున్నారు. దీని కారణంగా డిమెన్షియా వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి.. నిద్రలేమి బారిన పడకుండా రోజులో తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
ధూమపానం : పొగాకు సంబంధిత ఉత్పత్తుల్లోని నికోటిన్ మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందట. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో జరిపిన ఒక నివేదిక ప్రకారం.. సిగరెట్ తాగడం వల్ల మెదడు కుంచించుకుపోతుందని వెల్లడైంది. అది డిమెన్షియా, అల్జీమర్స్ వంటి బ్రెయిన్ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు.