Ragi Benefits for Numbness in Legs and Arms : నేటి ఆధునిక కాలంలో మన ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. మానసిక ఒత్తిళ్లు, పని వేళలతో పాటు ఆహారం విషయంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కొంతమంది మహిళలకు శరీరంలో కాల్షియం తక్కువగా ఉండడం వల్ల.. కాళ్లూ, చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఈ సమస్య పరిష్కారానికి ఆహారంలో ఒక ఐటమ్‌ను చేర్చుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి సూచిస్తున్నారు. దీనివల్ల తిమ్మిర్ల సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
సాధారణంగా గర్భందాల్చినప్పుడూ, బాలింతగా ఉన్నప్పుడూ శరీరానికి ఎక్కువ శాతం క్యాల్షియం అవసరమవుతుంది. ఈ క్రమంలో సంబంధిత ఆహారాన్ని, సప్లిమెంట్లను సరైన మోతాదులో రోజూ తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.
"కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. అవి అరగడానికి విటమిన్ డి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం తినే ఆహార పదార్థాల్లో ఇది అవసరమైనంత ఉండదు. కాబట్టి 16వేల ఐ.యు. ఉండే సప్లిమెంట్స్‌ను వారానికి ఒకసారి కచ్చితంగా తీసుకోవాలి."- డాక్టర్ లతాశశి (పోషకాహార నిపుణురాలు)
రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం, ఇనుము, పీచు పదార్థాలు, పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే, కాళ్లూ, చేతులూ ఎక్కువగా తిమ్మిర్లు వచ్చే మహిళలు రోజుకి 30 గ్రా.ల రాగుల్ని తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే, కేవలం రాగులు తినడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. పాలు, పాలపదార్థాల్లోనూ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మీదా ప్రభావం ఉండదు. కాబట్టి తగిన మోతాదులో పాలు, పెరుగు, పనీర్, తాజా ఆకుకూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితోపాటు శనగలు, అవిసెలు, నువ్వులనూ సాయంత్రం వేళల్లో తినాలి. ఇలా మంచి ఆహారాన్ని తినడం ద్వారా తిమ్మిర్ల సమస్య తగ్గిపోతుందని డాక్టర్ లతాశశి చెబుతున్నారు.
జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉంటూ ప్రకృతి అందించే చిరుధాన్యాలను తినాలని సూచిస్తున్నారు. ఈ రాగులతో ఇడ్లీ, దోశ, జావ వంటి అనేక ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినొచ్చని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాత్రిపూట నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా? - ఈ ప్రాబ్లమ్‌కి ఇలా చెక్ పెట్టండి!
అలర్ట్ : తరచూ అలసటగా ఉంటూ తిమ్మిర్లు వస్తున్నాయా? - కారణం అదే కావొచ్చు!