Para Cricketer Amir Hussain Interview : రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడుతూ అబ్బురపరుస్తున్నాడు జమ్ముకశ్మీర్ కు చెందిన అమీర్ హుస్సేన్. 8 ఏళ్ల వయసులోనే జరిగిన ఓ ప్రమాదంలో అమీర్ తన రెండు చేతులూ కోల్పోయాడు. అయినా అతడు కుంగిపోలేదు. పారా క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. షాట్లూ కొడుతున్నాడు. చేతిని తిప్పి వేసినట్లుగానే కుడి కాలి వేళ్ల మధ్య బంతిని ఒడిసిపట్టుకుని, బౌలింగ్ వేస్తున్నాడు. తాజాగా బంగాల్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన అమీర్ హుస్సేన్ ఈటీవీ భారత్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'భారత్ తరఫున ఆడడమే నా కల'
"క్రికెట్ లీగ్‌కు అతిథిగా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా గొప్పగా అనిపిస్తుంది. ఐపీఎల్ మాదిరిగానే మన దేశంలో కూడా ఐఎస్ పీఎల్ లీగ్ ఉంది. ఇక్కడ చాలా మంది పారా క్రికెటర్లకు ఆడే అవకాశం లభిస్తుంది. 8 ఏళ్ల వయసులో ఓ ప్రమాదం జరిగింది. అప్పుడు నా రెండు చేతులు కోల్పోయాను. దేశం కోసం క్రికెట్ ఆడాలనేది నా కల. అందుకే అప్పటి నుంచి ఎదురుచూసుకోలేదు. బ్యాట్‌ను మెడతో పట్టుకుని, నా పాదాలతో బంతిని కొట్టే అభ్యాసాన్ని ప్రారంభించాను. ఇప్పుడు జమ్ముకశ్మీర్ పారా క్రికెట్ టీమ్‌కు కెప్టెన్ అయ్యాను." అని అమీర్ హుస్సేన్ తెలిపాడు.
'ఆ రోజే నా జీవితంలో సంతోషమైనది'
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ సూచించాడు. తన జీవితంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తనను కలవడానికి వచ్చిన రోజే అత్యంత సంతోషకరమైనదని గుర్తుచేసుకున్నాడు. ఐఎస్పీఎల్కు సచిన్ తనను ఆహ్వానించారని తెలిపాడు. సచిన్ తన బౌలింగ్, బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయారని, అలాగే ముగ్దుడయ్యాడని చెప్పుకొచ్చాడు. సచిన్‌ను కలవాలనే తన కోరిక నెరవేరిందని, అలాగే ఆయన జెర్సీ ధరించి క్రికెట్ ఆడే అవకాశం లభించిందని అమీర్ వెల్లడించాడు.
'లక్ష్యం స్థిరంగా ఉండాలి'
అమీర్ హుస్సేన్ స్వస్థలం జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలోని బిజ్ బెహరా. అయితే 8ఏళ్ల ప్రాయంలోనే రెండు చేతులను కోల్పోయాడు. కానీ క్రికెట్ కోసం పరితపిస్తూ ప్రస్తుతం జమ్ము కశ్మీర్ పారా క్రికెట్ జట్టును నడిపించే స్థాయికి ఎదిగాడు. మున్ముందు మరింత మంచి స్థాయికి చేరుకుంటానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. జీవితంపై ఎప్పుడూ ఆశలు వదులుకోవద్దని అమీర్ హుస్సేన్ తెలిపాడు. అందరికీ మంచి రోజు వస్తాయని, కలలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాడు. లక్ష్యం ఎల్లప్పుడు స్థిరంగా ఉండాలని చెప్పాడు. క్రికెట్ ఆడేటప్పుడు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపాడు.