Ayurvedic Tips for Eye Health :కళ్లు ఆరోగ్యవంతంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. మీ బాడీని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచడం. ఇందుకోసం డైలీ పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే జ్యూసీ పండ్లు, కూరగాయలు, హెర్బల్ టీలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవాలంటున్నారు.
బ్యాలెన్స్ ఫుడ్స్ :కంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆయుర్వేదం ప్రకారం.. పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేసే ఫుడ్స్ తీసుకోవడం చాలా బాగా సహాయపడుతుందట. దోసకాయలు, కొబ్బరి నీరు, ఆకు కూరలు, ద్రాక్ష, పుచ్చకాయలు వంటి పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు.
నెయ్యి :రోజూ కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకోవడం వల్ల కళ్లకు మంచి లూబ్రికేషన్ లభించడమే కాకుండా దృష్టి మెరుగుపడుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇందుకోసం మీరు డైలీ నెయ్యిని వంటకాలలో ఉపయోగించడం లేదా వెచ్చని పానీయాలలో కలిపి తీసుకోవచ్చంటున్నారు. ఆవు నెయ్యి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.
కంటి వ్యాయామాలు : ఇతర శరీర భాగాల మాదిరిగానే కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ముఖ్యంగా కంటి కండరాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, కంటి ఒత్తిడిని తగ్గించడానికి.. రెప్పపాటు, కనుగుడ్లు తిప్పడం వంటి సాధారణ కంటి వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలంటున్నారు.
మంచి నిద్ర : కంటి ఆరోగ్యానికి తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యమంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకోసం డైలీ 7-8 గంటల నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నిద్రించడానికి కనీసం ఒక గంట ముందు డిజిటల్ పరికరాలను దూరంగా పెట్టాలని, పడుకునే గదిలో అనుకూలమైన నిద్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.