What Animals Can Cause Rabies : సాధారణంగా ర్యాబిస్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కుక్కకాటు. అంటే కుక్కకాటు వల్లనే ర్యాబిస్ అనే ప్రాణాంతక వైరస్ వ్యాపిస్తుందని అందరికీ తెలుసు. అయితే ఈ ప్రాణాంతక వైరస్ కుక్కల వల్ల మాత్రమే కాకుండా మరికొన్ని జంతువుల వల్ల కూడా వ్యాప్తి చెందొచ్చట. ఆశ్చర్యంగా అనిపించినా ఇందులో వాస్తవముందని పలు అధ్యయనాలు నిరూపించాయి. మరి ఆ జంతువుల పేర్లేంటో తెలుసుకుందామా?
పిల్లులు :పెంపుడు జంతువులు కాకుండా వీధుల వెంబడి తిరిగే పిల్లులు ర్యాబిస్ వైరస్ వ్యాప్తికి కారణమవుతాయట. ఇవి చాలా వరకు వీధుల్లో ఉండే ఇతర జంతువులతో గొడవ పడుతుంటాయి. అలా ఇన్ఫెక్షన్‌కు గురైన పిల్లులు మనుషులను కొరికితే, వారికి ర్యాబిస్ సోకే ప్రమాదం ఉంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెప్పిన దానిని బట్టి కుక్కలతో పాటు, పిల్లులలోనూ ర్యాబిస్ వైరస్ ఉంటుంది.
కోతులు :ప్రపంచమంతా ఒకే రకంగా ఉండదు కదా. అలాగే కోతుల్లోనూ ఒకే రకమైన వైరస్ ఉండదు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని కోతుల్లో మాత్రం ర్యాబిస్ అనే ప్రాణాంతక వైరస్ కామన్‌గా ఉంటుందట. అవి మనుషుల్ని కొరకడం లేదా గోళ్లతో రక్కడం లాంటివి చేసినప్పుడు ర్యాబిస్ సోకే ప్రమాదముందట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోతులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో వైరస్‌పై అవగాహన కార్యక్రమాలు జరిపిస్తుంటుంది.
గబ్బిలాలు :గబ్బిలాలు చాలా వేగంగా ర్యాబిస్ వ్యాప్తి చేస్తాయి. గబ్బిలం గాటు చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ సరైన సమయంలో వైద్య చికిత్స పొందకపోతే, ర్యాబిస్ ముదిరి ప్రాణాంతకం కావొచ్చు. అమెరికాలో గబ్బిలాల కారణంగా ర్యాబిస్ వ్యాప్తి ఎక్కువగా జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఎలుకలు : ఎలుకల్లో చాలా తక్కువ శాతమే కనిపించినా, సమూహంగా తిరిగే ఎలుకల్లో మాత్రం ర్యాబిస్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుందట. అందుకే ఎలుక కొరికినప్పుడు త్వరగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పొరబాటున ఎలుకలు ఆహారాన్ని ఎంగిలి చేసినా, లేదా ఎంగిలి చేశాయని అనుమానం కలిగినా, ఆ పదార్థాలను తినకూడదు.