Tollywood Directors Never Remake:టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి రీమేక్స్ అనేవి కొత్తేమీ కాదు. మాయాబజార్ కాలం నుంచి కూడా రీమేకులు తెలుగు సినిమాలు అలరిస్తూనే ఉన్నాయి. సినిమా రీమేక్ చేయడం అనేది చాలాసార్లు సక్సెస్ అవుతుందని హీరో డైరెక్టర్లు అనుకుంటారు. ఎందుకంటే ఒక భాషలో సక్సెస్ అయిన ఫార్ములా, మరో భాషలో సక్సెస్ అవుతుందని డైరెక్టర్లు నమ్ముతారు. ఈ నమ్మకంతోనే రీమేక్ సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్లో ఇప్పటివరకూ రీమేక్‌ల జోలికి వెళ్లని దర్శకులు ఎవరో మీకు తెలుసా?
కెరీర్లో రీమేక్‌లు చేయని దర్శకులు వీరే:తెలుగులో ఇప్పటివరకు రీమేక్ జోలికి వెళ్ళని సీనియర్ దర్శకులు చాలామంది ఉన్నారు. వీళ్ళందర్లో ముందు వరుసలో నిలిచేది దర్శక ధీరుడు రాజమౌళి. రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించినవే కావడం విశేషం.
ఇక మరో దర్శకుడు సుకుమార్ కూడా ఇప్పటిదాకా రీమేక్‌ల జోలికి వెళ్లలేదు. అలాగే ఈ లిస్ట్‌లో కొరటాల శివ కూడా ఉన్నారు. ఇక ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పూరి జగన్నాథ్ పేరు. ఎందుకంటే వీళ్లందరి కంటే పూరియే ఎక్కువ సినిమాలు తీశారు. ఆయన ఇప్పటివరకు తీసిన 35 పైగా సినిమాల్లో ఒకటి కూడా రీమేక్ లేదు.
యువ దర్శకుల్లో వీరి రూటే సెపరేటు:ఇక యువ దర్శకుల్లో చూసినట్లయితే అనిల్ రావిపూడి, బాబి కూడా రీమేక్‌లకు దూరంగా ఉన్నారు. అయితే సీనియర్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అఫీషియల్‌గా రీమేక్ సినిమా తీయలేదు. మధ్యలో 'అ ఆ' సినిమా విషయంలో కాస్త వివాదం ఉన్నప్పటికీ, ఆ సినిమాను రీమేక్ అని చెప్పలేం. ఇలా తెలుగులో రీమేక్‌ల జోలికి వెళ్లకుండా తమ సృజనాత్మకత శక్తికి పదును పెడుతూ కొనసాగుతున్న దర్శకుల సంఖ్య టాలీవుడ్లో తక్కువేమీ లేదు.