Sharukh Khan Movie With Stree 2 Director : పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో గతేడాది హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పటివరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే ఆయన వచ్చే ఏడాది వరుసగా మూడు చిత్రాలని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందింది. ఇప్పటి వరకు యాక్షన్, ప్రేమ కథలు, కామెడీ ఎంటర్‌టైనర్‌లతో అలరించిన ఆయన ఈ సారి తన కొత్త చిత్రం కోసం సాహసికుడుగా అవతారమెత్తనున్నట్లు తెలిసింది. రీసెంట్‌గానే స్త్రీ 2 చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు అమర్ కౌశిక్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. ఈ విషయాన్ని షారుక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
"ఏడాది పూర్తి అయిపోతున్నా ఇప్పటి వరకు షారుక్ తెరపైకి రాలేదు. అయితే ఆయన వచ్చే ఏడాది వరుసగా మూడు సినిమాలు ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి అమర్ కౌశిక్‌తో చేయనున్న ప్రాజెక్ట్. కొంత కాలంగా అమర్ కౌశిక్, షారుక్ మధ్య సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో అడవుల్లో సాహస యాత్ర చేసే వ్యక్తిగా షారుక్ కనిపించనున్నారు. మునుపెన్నడూ ఆయన ఇలాంటి పాత్ర పోషించలేదు. త్వరలో పూర్తి వివరాలను అఫీషియల్‌గా ప్రకటిస్తారు." అని షారుక్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.