Prabhas Fauji Update :పాన్ఇండియా హీరో ప్రభాస్- దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతోంది. 'ఫౌజీ' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. పలు షెడ్యూల్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత ప్రభాస్ గాయపడడం వల్ల ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.
ఇటీవల సెట్స్‌లో గాయపడిన ప్రభాస్ కోలుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ప్రభాస్‌లో పాల్గొంటారని సమాచారం. ఆయనపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లో స్పెషల్ సెట్ వేయనున్నారు. ప్రభాస్ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడే సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్.
ఈ మూవీ వార్ బ్యాక్ డ్రాప్, పీరియాడిక్ డ్రామా లవ్ స్టోరీగా రానుంది. 1940ల్లో సాగే వార్ సినిమా అని తెలుస్తోంది. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న కథాంశంగా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారని టాక్. హీరోయిన్‌గా ఇన్ స్టా ఫేమస్ ఇమాన్విని నటించనుంది. ఈమెను మూవీ లాంఛ్ సమయంలోనే మేకర్స్ పరిచయం చేశారు. అలాగే ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్‌ఇండియా సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్నారు.