Ilayaraja Daughter Bhavatharini Died : సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఆయన కూతురు భవతరణి(47) కన్నుమూశారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసినట్లు తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.
గత కొంతకాలంగా భవతరణి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. రీసెంట్గా పరిస్థితి విషమించడం వల్ల శ్రీలంకలోని ఓ ప్రైవైట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మరింత విషమించడం వల్ల గురువారం ఆమె కన్నుమూశారు. రేపు(జనవరి 26) సాయంత్రం ఆమె భౌతికకాయం చెన్నైకి రానున్నట్లు సమాచారం అందింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన తమిళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సినీ ప్రియులు కూడా నెట్టింట్లో ఆమెకు సంతాపం తెలుపుతూ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Bhavatharini Songs :కాగా, తన సోదరులు యువన్ శంకర్‌రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి(Bhavatharini died) కూడా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. సినీ రంగంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా తనదైన ముద్ర వేశారు. పలు తమిళ, తెలుగు చిత్రాల్లో పాటలు కూడా పాడారు. ఎక్కువగా తన తండ్రి, సోదరుల ఆధ్వర్యంలోనే ఎక్కువగా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె ఆలపించిన 'నను నీతో నిను నాతో కలిపింది గోదారి' (మంచు లక్ష్మీ గుండెల్లో గోదారి సినిమా) విశేషంగా ఆకట్టుకుంది. 'ఫ్రెండ్స్', 'పా', 'టైమ్', 'ఒరు నాళ్ ఒరు కనవు', 'అనెగన్' తదితర సినిమాల్లో పలు పాటలు ఆలపించారు. 'ఫిర్ మిలేంగే', 'ఇలక్కనమ్', 'వెల్లాచి', 'అవునా' తదితర సినిమాలకు కూడా సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు.