Toxic Movie Legal Notices : కన్నడ స్టార్ హీరో యశ్ అప్‌కమింగ్ మూవీ ప్రస్తుతం చిక్కులో పడింది. ఆయన లీడ్ రోల్లో గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న 'టాక్సిక్' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అయితే పర్యావరణానికి హాని కలిగించేలా ఆ మూవీ టీమ్ చెట్లను కొట్టేసి షూటింగ్ చేస్తున్నారంటూ గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు ఈ మూవీ టీమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖాండ్రే ఈ విషయాన్ని తాజాగా ధ్రువీకరించారు.
ఏం జరిగిందంటే?
గతేడాది అక్టోబర్ నుంచి బెంగళూరు సమీపంలోని పీన్య ప్రాంతంలో 'టాక్సిక్' సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే చిత్రీకరణ కోసం అక్కడున్న వందలాది చెట్లను నరికేసి, భారీ సెట్స్ వేసినట్లు అటవీశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మంత్రి ఈశ్వర్ ఖండ్రే షూటింగ్ స్పాట్‌కు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆ భూమికి సంబంధించిన వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అధికారులు చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపారు.
ఆ కోణంలో విచారణ :
అయితే 'టాక్సిక్' షూటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని అక్కడి అధికారులు హిందుస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్‌ఎంటీ) సంస్థకు కట్టబెట్టారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. హెచ్‌ఎంటీకి ఇచ్చిన తర్వాత దాన్ని అటవీ ప్రాంతంగా గుర్తించాల్సిన అవసరం లేదనేది వారి వాదన. అయితే,మంత్రిమండలి ఆమోదం లేకుండానే ఈ డీ-నోటిఫికేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది.
ప్రస్తుతం ఈ విషయంపైనే విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే హెచ్‌ఎంటీ నుంచి కెనరా బ్యాంకు ఆ ప్రాంతాన్ని కొనుగోలు చేసి 'టాక్సిక్' మూవీ టీమ్‌కు లీజుకు ఇచ్చింది. అయితే దీనిపై ప్రస్తుతం స్క్రుటినీ చేస్తున్నారు. ఆ స్థలం చుట్టూ వివాదాలు చుట్టుముట్టడం వల్ల షూటింగ్ ఆపాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడితే, సినిమా విడుదల మరింత ఆలస్యం అవ్వనుందని సినీ వర్గాల మాట. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబరు కల్లా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో అనుకున్న షెడ్యూల్‌కు ఈ సినిమా బయటకు వచ్చేలా లేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ లెవెల్లో 'టాక్సిక్' రిలీజ్ - డిసెంబర్ కల్లా థియేటర్లలోకి!
మహేశ్, నయన్, యశ్ - వీరందరూ బాలీవుడ్ సినిమాలకు నో ఎందుకు చెప్పారో తెలుసా?