Ilaiyaraaja Biopic Dhanush :కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ వరుస ఆఫర్లతో కోలీవుడ్‌లో దూసుకెళ్తున్నారు. తాజాగా 'రాయన్' అనే థ్రిల్లర్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన ఆయన, దీంతో పాటు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న'కుబేర' సినిమాలోనూ నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆయన తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు వెల్లడించారు. మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌గా తెరకెక్కనున్న 'ఇళయరాజా' సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. నేడు (మార్చి 20)న ఈ సినిమాను మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌తో అఫీషియల్‌గా లాంఛ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేదికపై హీరో ధనుశ్ ఎమోషనలయ్యారు.
" నీ ఆలోచనలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఎప్పుడూ చెబుతుంటాను. చాలామంది ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఇళయరాజా పాటలు వింటుంటారు. కానీ, నేను మాత్రం ఆయన బయోపిక్‌లో ఎలాగైనా నటించాలని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపాను. రజనీకాంత్, ఇళయరాజా అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లిద్దరి బయోపిక్స్‌లో నటించాలని కోరుకున్నాను. అందులో ఓ కల ఇప్పుడు నెరవేరింది. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇళయరాజాకు నేనొక భక్తుడిని. యాక్టింగ్‌లో నాకు గురువు ఆయన సంగీతం. ప్రతీ సీన్‌కు ముందు ఆయన మ్యూజిక్ వింటుంటాను. ఎలా నటించాలో అదే నాకు నేర్పిస్తుంది" అని ధనుశ్ చెప్పుకొచ్చారు.