Hari Hara Veera Mallu Final Schedule Shooting : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇప్పుడు అందుకు తగ్గట్టుగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్లనుంది. ప్రస్తుతం ముగింపు దశకు వచ్చిన ఈ సినిమా షూటింగ్ సెట్‌లోకి పవన్ అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ విజయవాడలో ఈ వారాంతం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్‌పై అత్యంత కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట దర్శకుడు జ్యోతికృష్ణ. ఈషెడ్యూల్లో దాదాపు 200మంది ఆర్టిస్టులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం అందింది.
చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ శక్తిమంతమైన యోధుడిగా కనువిందు చేయనున్నారు. రాబిన్ హుడ్ పాత్ర అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సినిమాను రెండు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. మొదటి భాగం హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రానుంది. మార్చి 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందు కనువిందు చేయనుంది. ఏఎం రత్నం సమర్పిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.