Jasprit Bumrah Champions Trophy 2025 : టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతాడని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే, టీమ్ ఇండియానే గ్రూప్ ఏలో అత్యంత బలహీనమైన పేస్ అటాక్‌ను కలిగి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో టీమ్ ఇండియా పేసర్లు ఎవరూ తమ అత్యుత్తమ ఫామ్ కనబరచలేదని తెలిపాడు. ఇది ఐసీసీ టోర్నమెంట్లో జట్టును ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
"గాయం నుంచి కోలుకున్న తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లో మహ్మద్ షమీ ఇంకా అత్యుత్తమ పెర్ఫామెన్స్ చేయలేదు. రీఎంట్రీ తర్వాత షమీ టాప్ గేర్‌ను అందుకోలేదు. అతని స్పీడ్ తగ్గింది. స్పీడ్ అనేది ఒక్కొ బౌలర్‌కు ఒక్కొలా పనిచేస్తుంది. భువనేశ్వర్ కుమార్ గంటకు 132 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. షమీ అదే వేగంతో వేస్తే కుదరదు. షమీ గంటకు 137-138 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి." అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
టీమ్ఇండియా యంగ్ బౌలర్ హర్షిత్ రాణా పరుగులు ఎక్కువగా సమర్పించుకుంటున్నాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడిలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. "కటక్ పిచ్ లో మంచి లెంగ్త్ లో బౌలింగ్ వేయాల్సింది. కానీ హర్షిత్ అలా చేయలేకపోయాడు. స్టంప్స్‌కు దూరంగా బాల్స్ వేశాడు. దీంతో మూడు ఓవర్ల తర్వాత అతడి స్పెల్‌ను కెప్టెన్ ఆపాడు. కానీ హర్షిత్ హిట్ ది డెక్ శైలితో పాత బంతితో బాగా బౌలింగ్ చేస్తాడు." అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
కాగా, ఆసీస్ టూర్ చివరిలో వెన్నునొప్పితో ఇబ్బందిపడిన బుమ్రా అప్పట్నుంచి ఏ మ్యాచ్ ఆడలేదు. ఒకవేళ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేకపోతే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఆఖరి గడువు అప్పుడే :
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. జట్టులో మార్పులు, చేర్పులకు మంగళవారంతో గడువు ముగియనుంది. వెన్నునొప్పి కారణంగా ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో ఉంటాడా? లేదా అనే దానిపై బీసీసీఐ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.
టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ 2 పొజిషన్‌కు SRH బ్యాటర్ - టాప్ 10లో ముగ్గురు భారత ప్లేయర్ల హవా!
సౌతాఫ్రికాపై కేన్ సూపర్ సెంచరీ- దెబ్బకు కోహ్లీ రికార్డు బ్రేక్