Manda Krishna Madiga Thank You To CM Revanth Reddy : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులతో కలిసి సీఎంతో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు.
ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశాం : ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించామని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తామని, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేసే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ, న్యాయకమిషన్ వేసి అధ్యయనం చేయించామని, వేగంగా నివేదిక తీసుకుని, కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టామని తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని అన్నారు.
కొన్ని లోపాలున్నాయి : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని, ఇందులో సీఎం రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందని గుర్తు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపామని అన్నారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ ఎమ్మార్పీఎస్‌కు అండగా ఉన్నారని గుర్తు చేశారు. షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారని, రిజర్వేషన్ శాతం విషయంలో కొన్ని లోపాలున్నాయని తెలిపారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతిపత్రం అందజేశామని అన్నారు.
ఎస్సీ కుల్లాల్లో అత్యధికంగా 62 శాతం జనాభా ఉన్న మాదిగలను రిజర్వేషన్ శాతంలో అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ జనాభాలో రెండో స్థానంలో ఉన్న మాలలను జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తరహాలోనే ఏబీసీడీ వర్గీకరణ చేయాలని, చేవెళ్ల డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు ఎస్సీ వర్గీకరణను 15 నుంచి 18 శాతం పెంచి వెంటనే అమలు చేయాలని మందకృష్ణ సీఎంను కోరారు. ఎస్సీ వర్గీకరణలో ఉన్న లోటుపాట్లను రేవంత్ రెడ్డి సరిదిద్దుతారని భావిస్తున్నామని ఆయన అన్నారు.
"ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. ఎన్నో సందర్భాల్లో రేవంత్‌రెడ్డి ఎమ్మార్పీఎస్‌కు అండగా ఉన్నారు. షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారు. రిజర్వేషన్ శాతం విషయంలో కొన్ని లోపాలున్నాయి. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతిపత్రం అందజేశాం."- మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు