Best Animal Based Indian Movies : భారతీయ సినీ పరిశ్రమలో జంతువులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. హీరోకు సమానంగా వాటి పాత్రలను దర్శకులు తీర్చిదిద్దారు. ఇలా సినిమాల్లో నటులతో పాటు జంతువులు ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులు మనసు కొల్లగొట్టిన ఐదు సినిమాలపై ఈ స్టోరీలో ఓ లుక్కేద్దాం.
1. 777 చార్లీ
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ '777 చార్లీ'. దర్శకుడు కిరణ్ రాజ్ ఈ సినిమాకు మానవుడు-శునకం మధ్య ఎమోషన్‌కు చక్కగా చూపించి హిట్ అందుకున్నారు. ఓ ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి చిన్నతనం నుంచి ఒంటరిగా జీవితం గడుపుతుంటారు ధర్మ (రక్షిత్ శెట్టి). అలాంటి ధర్మ జీవితంలోకి ఓ రోజు చార్లీ అనే శునకం ఎంట్రీ ఇస్తుంది. అనుకోని పరిస్థితుల్లో యజమాని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఛార్లీ ఎలాంటి ఇబ్బందులు పడింది? ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది? వారి మధ్య అనుబంధం ఎలా సాగింది? చివరికి ఏమైంది? అన్న ఆసక్తికర కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఆఖరి సన్నివేశాల్లో ఆద్యంతం ఉద్వేగంగా సాగిందీ సినిమా.
2. హమ్ ఆప్కే హై కౌన్ (1994)
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ భరత్యాజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హమ్ ఆప్కే హై కౌన్'. ఈ సినిమాలో మాదురీ దీక్షిత్ హీరోయిన్గా నటించారు. ఇందులో టఫీ అనే శునకం హీరోహీరోయిన్లు మధ్య ప్రేమలేఖలను నడుపుతుంటుంది. ఈ సినిమాలో ఈ కుక్క నటన కూడా హైలెట్‌గా నిలిచింది.
3. మా (1991)
ఈ సినిమాలో అసాధారణ హీరో డాబీ అనే శునకం. ఈ కుక్క చాలా ధైర్యంగా ఉంటుంది. ఎవరికీ భయపడదు. సినిమాలో మరణించిన హీరోయిన్ (జయప్రద) ఆత్మగా శునకంలోకి వచ్చి తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ఆ తర్వాత డాబీనే సినిమా మొత్తం ఉంటుంది. ఈ సినిమాకు అనిల్ కశ్యప్ దర్శకత్వం వహించారు. జయప్రద, జీతేంద్ర కీలక పాత్రల్లో నటించారు.
4. నాగినా (1986)
నాగినా సినిమాలో దివంగత నటి శ్రీదేవీ సర్పంగా నటించారు. భర్తను చంపినవారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆకారాన్ని మార్చుకునే సర్పంగా కనిపించారు. ఈ సినిమాలో శ్రీదేవి చేసే నాగిన్ డ్యాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలవడం వల్ల శ్రీదేవికి సూపర్ స్టార్ హోదా వచ్చింది. ఈ సినిమాను హర్మేశ్ మల్హోత్రా తెరకెక్కించారు.
5. హాతి మేరే సాథి (1971)
రాజేశ్ ఖన్నా, తనూజ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'హాతి మేరే సాథి'. ఇందులో రాము అనే విశ్వాసమైన ఏనుగు కీలక పాత్ర పోషించింది. విడిపోయిన హీరోహీరోయిన్లను కలపడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది గజరాజు. ఈ క్రమంలో తన ప్రాణాలను లెక్కచేయదు. ఆ సమయంలో చాలా మంది ప్రేక్షకులకు భావోద్వేగానికి గురై కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ సినిమాలోని 'చల్ చల్ మేరే సాథి' పాట ఇప్పటికీ ఒక క్లాసిక్ హిట్‌గా మిగిలిపోయింది.