International Day of Women and Girls in Science: నేడు 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్'. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో బాలికలు, మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేపట్టేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఈ నేపథ్యంలో 2016లో UN ఫిబ్రవరి 11వ తేదీని 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్'గా ప్రకటించింది. అప్పటి నుంచి నేటికీ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
సైన్స్‌లో మహిళలు & బాలికల అంతర్జాతీయ దినోత్సవం ప్రాముఖ్యత: హెల్త్ నుంచి క్లైమేట్ ఛేంజ్ సెక్టార్ వరకు స్థిరమైన అభివృద్ధి ఎజెండాను నెరవేర్చేందుకు మహిళలు అవసరం. ఈ రంగాల్లో గతంలో కంటే ఎక్కువమంది మహిళలకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు & బాలికలు కీలక పాత్ర పోషిస్తున్నారని, దీంతో ఈ రంగాలలో వారి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్' గుర్తుచేస్తుంది.
దీని ప్రారంభం: ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ (IDWGS) పదేళ్ల క్రితం ప్రారంభమైంది. 2016లో UN ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రస్తుతం అంటే ఇవాళ దీని పదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సైన్స్ రంగంలో మహిళల సహకారాన్ని గౌరవించడం, భవిష్యత్తులో సైన్స్ వైపు వారిని ప్రోత్సహించడంతో పాటు సమాజంలో బాలికలు, మహిళలకు సైన్స్ పట్ల ప్రతికూల ఆలోచనలను తొలగించడమే దీని లక్ష్యం.
IDWGS పదవ వార్షికోత్సవం సందర్భంగా UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాలలో మహిళలు & బాలికలకు మార్గం సుగమం చేయాలని, వారికి అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ఏడాది థీమ్ ఏంటంటే?: ఈ ఏడాది సైన్స్‌లో మహిళలు & బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని 'అన్‌ప్యాకింగ్ STEM కెరీర్స్: హెర్ వాయిస్ ఇన్ సైన్స్' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో మహిళల కృషి గురించి తెలుసుకుందాం రండి.
![International Day of Women and Girls in Science](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23519909_international_day_of_women_and_girls_in_science.jpg)
సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల పాత్ర: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులలో సగటున 33.3% మంది మహిళలే ఉన్నారంటే మీరు నమ్ముతారా? అయితే ఇదే వాస్తవం. వారిలో 35% మంది మహిళా విద్యార్థులు కేవలం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌కి సంబంధించిన రంగాలపైనే అధ్యయనం చేస్తున్నారు.
2016లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సంబంధించి 30% మాత్రమే అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం పురుషులు, మహిళా పరిశోధకులు సమాన సంఖ్యలో ఉన్నారు. అయితే రిజల్ట్స్ గురించి మాట్లాడితే ఈ సబ్జెక్టులలో అబ్బాయిలు, అమ్మాయిల ఫలితాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లలు ఈ రంగాలలో రాణించలేరనే జెండర్ స్టీరియోటైప్ (లింగ మూస ధోరణి) ఉంది.
అందుకే వారి కుటుంబాలు, సమాజం ఈ రంగాల్లో మహిళలు, బాలికలను తక్కువగా ప్రోత్సహిస్తుంది. దీంతో ఏ రంగంలో చూసినా టాప్ మేనేజ్‌మెంట్ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఇందులో చాలా మెరుగుదల కనిపించినా ఇప్పటి వరకు కేవలం 22 మంది మహిళలకు మాత్రమే సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి లభించింది.
సైన్స్ లీడర్‌షిప్‌లో భారత మహిళలు:
సీతా కోల్‌మన్-కమ్ముల: సీతా కోల్‌మన్ రసాయన శాస్త్రవేత్త, పర్యావరణవేత్తతో పాటు వ్యాపారవేత్త కూడా. ఆమె సింప్లీ సస్టైన్ సంస్థను స్థాపించారు. పర్యావరణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏదైనా ఉత్పత్తిని తయారు చేయాలనే అంశంపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ లైఫ్ సైకిల్‌తో పాటు ఈ ఉత్పత్తుల వ్యర్థాలు భవిష్యత్తులో పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అంచనా వేస్తుంది.
సుధా మూర్తి: సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సుధా మూర్తి పేరు చాలా పాపులర్. ఈ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళల్లో ఆమె ఒకరు. అంతేకాకుండా దేశంలో, ప్రపంచంలోని ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ అండ్ గేట్స్ ఫౌండేషన్ పబ్లిక్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్‌లో సభ్యురాలు కూడా. ఇవి మాత్రమే కాకుండా ఆమె ఒక సుప్రసిద్ధ రచయిత, ఇంజనీరింగ్ టీచర్. ఆమె కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచనలు చేస్తారు. ఇలా ఆమె ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.
నిగర్ షాజీ: నిగర్ షాజీ ఇండియన్ ఏరోస్పేస్ ఇంజనీర్. ఆమె 1987లో ISROలో చేరారు. అప్పటి నుంచి దేశంలోని అనేక స్పేస్ ప్రోగ్రామ్స్‌లో నిగర్ షాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సాధించిన అతిపెద్ద విజయాలలో ఆదిత్య-L1 మిషన్ ఒకటి. ఇది సూర్యుడిని అన్వేషించడానికి ప్రయోగించిన భారత మొదటి సోలార్ మిషన్. దీనికి ఆమె ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
సుధా భట్టాచార్య: సుధా భట్టాచార్య జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లోని స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్. ఆమె పరమాణు పారాసిటాలజీలో అత్యంత ముఖ్యమైన సహకారం అందించారు.
సునీతా సరావగి: IIT బాంబేలో విశిష్ట ప్రొఫెసర్‌గా పనిచేసిన సునీతా డేటాబేసెస్, డేటా మైనింగ్‌లో తన అద్భుతమైన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు.
టెస్సీ థామస్: టెస్సీ థామస్ 'మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా'గా పేరొందారు. ఆమె భారత్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్‌లో కీలక పాత్ర పోషించారు.
గగన్‌దీప్ కాంగ్: గగన్‌దీప్ కాంగ్ భారత్‌లో ఫేమస్ మైక్రోబయాలజిస్ట్. భారతదేశం నుంచి 2019లో 'రాయల్ సొసైటీకి ఫెలో'గా ఎన్నికైన మొదటి మహిళ ఈమే.
సేఫర్ ఇంటర్నెట్ డే: నెట్టింట్లో బీ కేర్‌ఫుల్- ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
సునీతా రాకపై సర్వత్రా ఉత్కంఠ- షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి!- ఎలాగంటే?
ఏంటి మామా ఇది నిజమేనా.. 10 నిమిషాల్లోనే కార్ల డెలివరీనా?- జెప్టో క్రేజీ వీడియో చూశారా?