Stock Market Today : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు భారత్ సహా పలు దేశాల్లోని స్టాక్ మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. షాంఘై, జపాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా స్టాక్ మార్కెట్లు సైతం నష్టాలను చవిచూశాయి. భారత స్టాక్ మార్కెట్ సూచీలూ డౌన్ అయ్యాయి. ఒకానొక దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1000కిపైగా పాయింట్లు నష్టపోయింది.
చివరకు 1018.20 పాయింట్ల నష్టంతో 76,293.60 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క భారతీ ఎయిర్‌టెల్ తప్ప మిగతా షేర్లన్నీ నష్టపోయాయి. ఇందులో ఎక్కువగా నష్టపోయిన బ్లూ చిప్ కంపెనీల్లో పవర్ గ్రిడ్, జొమాటో, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ ఉన్నాయి. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరై రూ.408 లక్షల కోట్లకు చేరింది.
వాహన రంగ షేర్లపై ట్రంప్ ప్రభావం
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 309.80 పాయింట్లు నష్టపోయి 23,071.80 వద్ద ముగిసింది. నిఫ్టీ ఒకానొక దశలో 23వేల పాయింట్ల దిగువకు చేరింది. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు భారీగా జరిగాయి. వాహనాల తయారీకి స్టీల్, అల్యూమినియం తప్పక అవసరం. వాటి దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో వాహన రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
పతనానికి కారణాలు
- స్టీల్, అల్యూమినియంపై టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు
- తమపై సుంకాలు వేస్తున్న దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు
- భారత ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 10వతేదీన కూడా రూ.2,463 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు
- భారత రూపాయి మరింత బలహీన పడుతోంది. ఈ కారణంతో విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు
- భారత్‌లో కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు పెద్దగా మెప్పించలేదు. దీంతో సాధారణంగా స్టాక్ మార్కెట్లు నెగెటివ్‌గా స్పందించాయి
లాభపడిన షేర్లు : అదానీ ఎంటర్‌ప్రైజెస్ (1.56 శాతం), గ్రాసిమ్ (0.83 శాతం), ట్రెంట్ (0.46 శాతం), హిండాల్కో (0.11 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (0.10 శాతం). లాభపడిన ఇతర కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఐటీసీ ఉన్నాయి.
నష్టపోయిన షేర్లు : ఐచర్ మోటార్స్ (6.67 శాతం), అపోలో హాస్పిటల్ (6.55 శాతం), శ్రీరాం ఫైనాన్స్ ( 3.71 శాతం), కోల్ ఇండియా ( 3.04 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (2.99 శాతం), భారత్ ఎలక్ట్రానిక్స్ (2.93 శాతం)
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్- సెన్సెక్స్ 1397 పాయింట్లు జంప్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 500+ పాయింట్స్ డౌన్!