Ilayaraja's Copyright Issue : ఇళయరాజా కంపోజ్ చేసిన 4వేల 500 పాటలను తన అనుమతి లేకుండా వాడుకుంటున్నారంటూ వేసిన వ్యాజ్యం మరోసారి వాయిదా పడింది. ఎకో రికార్డింగ్ సంస్థపై ఇళయరాజా చేసిన అప్పీల్‌ను జూన్ 13న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్ మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌ల మొదటి డివిజన్ బెంచ్ విచారించింది. ఎకో తరపున సీనియర్ న్యాయవాది విజయ్ నారాయణ్ వాదన వినిపించారు. ఇళయరాజాకు తమ సినిమాల్లోని పాటలకు కంపోజ్ చేయాలని పలు చిత్ర నిర్మాతలు పని అప్పగించి, దానికి తగ్గ రెమ్యూనరేషన్ ఇచ్చారని, కాబట్టి కాపీరైట్ పూర్తిగా సంబంధిత నిర్మాతల వద్దనే ఉంటుందని నారాయణ్ పేర్కొన్నారు.
ఈ పాటలకు సంబంధించిన కాపీ రైట్ ఇళయరాజా వద్దనే ఉందనడానికి, ఈ పాటల ఆల్బమ్‌ను ఆయన సొంతంగా రిలీజ్ చేయలేదని గుర్తుచేశారు. ఎకో కంపెనీ కేవలం పాటలను కొనుగోలు చేయడం, విక్రయించడం లాంటివి చేస్తుంటుందని అందుకోసం ఇళయరాజా దగ్గర నుంచి ఎలాంటి కాపీ రైట్ హక్కులను తీసుకునే అవసరం లేదని వెల్లడించారు.
"తాను సంగీతం సమకూర్చడం వల్లనే ఆ సినిమాలు హిట్ అయ్యాయని ఇళయరాజా భావిస్తున్నారు. కానీ, తాను కూడా ఆ సినిమా యూనిట్‌లో కాంట్రాక్ట్‌డ్ ఎంప్లాయీ అనే సంగతి మర్చిపోయి సెపరేట్ కాపీరైట్ అడుగుతున్నారు. ఇలా క్రియేటివ్ వర్క్ గురించి కాపీరైట్ క్లెయిమ్ చేయాలనుకుంటే పాటల రచయితలు కూడా అదే పని చేయాలి. రెహ్మాన్ ఎప్పుడూ తన పాటల గురించి కాపీరైట్ అడగలేదే. ఒక పాట బయటకు రావాలంటే సంగీతం సమకూర్చడంతో పాటు సింగర్ కూడా కావాలి. ఇళయరాజా సమకూర్చిన సంగీతానికి వేరొకరు పేరు ఆపాదించడం లాంటి వాటిని మాత్రమే కాపీరైట్ అంటారు. చట్టం ముందు అందరూ సమానులే. ఇళయరాజాకు ప్రత్యేక హక్కులేమీ లేదు" అని వాదించారు. తమ క్లయింట్ అయిన ఎకో సంస్థ ఇళయరాజా కంపోజ్ చేసిన 4వేల 500పాటలకు సంబంధించిన రైట్స్‌ను ఆయా నిర్మాతల నుంచి కొనుగోలు చేసిందని కౌన్సిల్ తరపు న్యాయవాది తెలిపారు.