How to Clean Stained Mirror Glass: మనలో చాలా మంది ఇల్లు అందంగా కనిపించేందుకు డ్రెస్సింగ్ టేబుల్, బాత్‌రూమ్, లివింగ్ రూమ్ ఇలా ఆయా గదుల్లో అద్దాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే వీటిపై దుమ్ము, ధూళి చేరడమే కాకుండా నీళ్ల మరకలూ పడి మురికిగా కనిపిస్తుంటాయి. అయితే, వీటిని తొలగించి అద్దాన్ని తళతళ మెరిపించాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షేవింగ్ క్రీమ్‌తో!
వేడినీటితో స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్‌లోని అద్దంపై పొగమంచులా ఒక పొర ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. స్నానానికి ముందే ఆ అద్దంపై షేవింగ్ క్రీమ్‌ను సన్నటి పొరలా పూయాలని నిపుణులు చెబుతున్నారు. స్నానం పూర్తయ్యాక పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచేస్తే ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇంకా కార్ల అద్దాలు, గ్లాస్ కిటికీలు వంటివి శుభ్రం చేయడానికి కూడా ఈ చిట్కాను ఉపయోగించచ్చని సూచిస్తున్నారు.
డిస్టిల్డ్ వాటర్
ఇంట్లోని అద్దాన్ని క్లీన్ చేయడానికి చాలామంది సాధారణ నీటిని వాడుతుంటారు. కానీ, దీనికి బదులు డిస్టిల్డ్ వాటర్‌ను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటితో తుడవడం వల్ల అద్దంపై మరకలు, దుమ్ము, ధూళి వంటివి ఈజీగా తొలగిపోయి అద్దం తళతళలాడుతుందని అంటున్నారు. ఇక ఈ నీటిని ఇతర క్లీనింగ్ ఉత్పత్తుల్లో కూడా కలుపుకొని వాడుకోవచ్చని సూచిస్తున్నారు.
బేకింగ్ సోడాతో
అద్దంపై పడిన జిడ్డు మరకల్ని తొలగించడంలో బేకింగ్ సోడా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఓ స్పాంజి లేదా శుభ్రమైన గుడ్డను బేకింగ్ సోడాలో అద్ది దాంతో అద్దంపై మరకలు పడిన చోట రుద్దాలని చెబుతున్నారు. ఆ తర్వాత దానిపై కొన్ని నీళ్లు చల్లి మరో శుభ్రమైన గుడ్డతో తుడిచేస్తే అద్దంపై ఉన్న మొండి మరకలన్నీ తొలగిపోయి అద్దం తళతళా మెరిసిపోతుందని వివరిస్తున్నారు.
తెల్లటి పేపర్‌తో
తెల్లటి పేపర్‌తో కూడా అద్దంపై పడిన జిడ్డు మరకల్ని తొలగించవచ్చని నిపుణులు అంటున్నారు. తెల్లటి పేపర్లను ఉండలుగా చుట్టి, నీటితో తడిపి.. వీటితో అద్దంపై నెమ్మదిగా, గుండ్రంగా పై నుంచి కింది వరకు రుద్దుతూ రావాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అద్దంపై పడిన మరకలు సులభంగా తొలగిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా వెనిగర్, నీరు కలిపిన మిశ్రమాన్ని ముందుగా అద్దంపై స్ప్రే చేసి.. తర్వాత దాన్ని పేపర్‌తో శుభ్రం చేసినా సరిపోతుందని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో అద్దాన్ని క్లీన్ చేసేందుకు కొందరు న్యూస్ పేపర్‌ను వాడుతుంటారు. కానీ తడి వల్ల ఆ పేపర్ ఇంక్ అద్దానికి అంటుకొని మరిన్ని మరకలయ్యే అవకాశం ఉంటుందని.. కాబట్టి తెల్లటి పేపర్ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అద్దం మూలల్ని కాటన్ స్వాబ్స్, మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయాలని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
లవ్‌లో ఉంటే ఎలా హగ్ చేసుకుంటారు? కౌగిలింతల వెనుక రీజన్స్ తెలుసా?
ఈ 10 రూల్స్ పాటిస్తే మీ పిల్లల ఫ్యూచర్ సూపర్! పేరెంటింగ్ టిప్స్ మీకు తెలుసా?