Anupama Parameswaran Paradha : టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పరదా'. ఈ సినిమాను డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల సోషియో డ్రామా జానర్లో తెరకెక్కించారు. బుధవారం మేకర్స్ టీజర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఇదో భిన్నమైన కథ అని అర్థమవుతోంది.
సోషియో డ్రామాగా రాబోతున్న 'పరదా' టీజర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ 'సుబ్బు' అనే పాత్ర పోషించింది. 'ఛ పిచ్చి గిచ్చి గానీ పట్టిందా ఆ అమ్మాయికి. అక్కడెక్కడో చావడానికి రూ.70 లక్షలు ఇస్తుందట' అనే డైలాగుతో టీజర్ మొదలవుతుంది. బతకడానికి కాదు, చావడానికి డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి? అనే ఆలోచన కలుగుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
ఇతర కీలక పాత్రలు దర్శన రాజేంద్రన్, సంగీతతో కలిసి అనుపమ ఓ యాత్రకు వెళ్తుంది. ఇందులో అందరికీ పరస్పర విరుద్ధ భావాలు ఉంటాయని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఎప్పుడూ 'పరదా'తో ముఖానికి ముసుగు వేసుకుని ఉండే అనుపమని, దర్శన రాజేంద్రన్ ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతుంది. 'నాకోటి అర్థం కావట్లేదు. పరదాతోనే కవర్ చేసుకోవాలా? లేదంటే హెల్మెట్ లాంటివి ఏదైనా ఉపయోగించవచ్చా?' అని అడుగుతుంది.
అయితే అనుపమ స్వగ్రామంలో ఉండే ఆడవాళ్లంతా అలా 'పరదా'లతో ముఖాన్ని దాచుకుంటారు. గ్రామంలో గుడి, అమ్మవారు, ఊరు కోసం ఏదైనా చేసే జనం, సంప్రదాయాలు, ఆచారాలు, మూఢనమ్మకాల చుట్టూ కథ తిరుగుతుంది. సాహస యాత్ర ఎందుకు? పరదా వెనకున్న కథ ఏంటి? వంటి అంశాలు సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి. 'పరదా' టైటిల్‌పైన క్యాప్షన్ 'ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్' కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ ప్రేమ దేని గురించి? అనేది మాత్రం దర్శకుడు టీజర్‌లో కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు.
సుబ్బుగా అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్, పరదాలో లుక్స్ సూట్ అయ్యాయి. యాత్రలో కనిపించే లొకేషన్లు చాలా అందంగా ఉన్నాయి. టెక్నికల్‌గా పరదా ఒక విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫర్ మృదుల్ సుజిత్ సేన్, హిమాచల్ ప్రదేశ్‌లోని సుందరమైన ప్రదేశాలను అందంగా క్యాప్చర్ చేశాడు. అన్ని సీన్స్‌ని గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఎలివేట్ చేసింది. త్వరలో తెలుగు, మలయాళం రెండింటిలోనూ విడుదల కానుంది.
కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత, దర్శణ రాజేంద్రన్ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సినిమా విడుదల తేదీ మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
ట్రాక్ మార్చిన టిల్లు బ్యూటీ - లేడీ ఓరియెంటడ్ మూవీస్‌కు సై - Anupama Parameswaran New Movie
అనుపమ దారెటు- 'టిల్లు స్క్వేర్'తో కన్ఫ్యూజన్లో లిల్లీ! - Anupama Parameswaran