How To Make Vegetarian Sushi at Home: 'సుషీ' ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ఓ వంటకం. ఈ రెసిపీ జపాన్‌లో ఫేమస్. సుషీ అంటే పులియబెట్టిన అన్నంతో నిల్వ చేసిన వంటకం. మరి ఈ జపాన్ ఫేమస్ వెజ్ సుషీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - 1 కప్పు
- వెనిగర్ - 1 టేబుల్ స్పూన్
- పంచదార - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- కీరా దోస - 1
- క్యారెట్ - 1
- ఆవకాడో - 1
- సీవీడ్ షీట్స్
- రోలింగ్ మ్యాట్
తయారీ విధానం:
- ముందుగా బియ్యాన్ని ఓసారి కడిగాలి. ఆ తర్వాత బియ్యానికి రెండింతలు అంటే ఓ కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ సుషీ కోసం బియ్యం సెపరేట్‌గా ఉంటాయి. అవి ప్రస్తుతం అన్ని రకాల సూపర్ మార్కెట్స్, ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ అవి లేకపోతే నార్మల్‌గా వండుకునే బియ్యాన్ని కూడా ఉపయోగించవచ్చు.
- పది నిమిషాల తర్వాత ఓ గిన్నెలోకి ఈ బియ్యాన్ని నీళ్లతో సహా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టి అన్నం వండుకోవాలి.
- అన్నంగా తయారైన తర్వాత ఓ చెక్క ప్లేట్లోకి తీసుకోవాలి. చెక్క ప్లేట్ లేకపోతే నార్మల్ ప్లేట్లోకి తీసుకుని కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఈలోపు ఓ బౌల్లోకి వెనిగర్, పంచదార, ఉప్పు వేసి షుగర్, సాల్ట్ కరిగే వరకు కలపాలి.
- ఈ మిశ్రమం కరిగిన తర్వాత చల్లార్చుకున్న అన్నంలోకి కొద్దికొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వెనిగర్ మిశ్రమాన్ని మొత్తాన్ని అన్నంలోకి పోస్తూ మిక్స్ చేసి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు కీరాదోస, క్యారెట్‌ను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత కీరాదోసను సగానికి కట్ చేసి అందులో ఓ సగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కీరాదోసపై గింజలు ఉన్న లేయర్ వరకు తీసేసి మిగిలిన కీరాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా గింజలు తీసేయడం వల్ల అందులోని నీరు అన్నంలోకి చేరకుండా ఉంటుంది. లేదంటే గింజల్లోని నీరు అన్నానికి చేరి మెత్తగా అవుతుంది.
- క్యారెట్‌ను సగానికి చేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆవకాడోను కూడా అలానే కట్ చేసుకోవాలి. కేవలం ఇవి మాత్రమే కాకుండా నచ్చితే ఇతర కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు రోలింగ్ మ్యాట్‌ను తీసుకోవాలి. దాని మీద సముద్రపు నాచు షీట్స్‌లో ఒకదానిని పెట్టాలి.
- ఆ సీవీడ్ మీద ఉడికించి వెనిగర్ కలిపిన అన్నాన్ని ఉంచి ఆ షీట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఇలా అన్నం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసిన కీరా, క్యారెట్, ఆవకాడో ముక్కలను షీట్ మధ్యలో పెట్టి రోలింగ్ మ్యాట్ సాయంతో రోల్ చేసుకోవాలి.
- ఇలా రోల్ చేసుకున్న తర్వాత రోలింగ్ మ్యాట్ తీసేసి అర ఇంచ్ మందంతో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ సుషీ రెడీ. దీన్ని సోయా సాస్‌తో తింటే అద్దిరిపోతుంది. నచ్చితే మీరూ ఈ రెసిపీని ట్రై చేయండి.
నోరూరించే కమ్మని "మసాలా మిర్చి ఫ్రై" - వేడివేడి అన్నంలో అమృతమే!
చలికాలంలో అద్దిరిపోయే "మటన్ పాయ సూప్" - ఇలా చేసుకొని జుర్రితే రుచితో పాటు ఆరోగ్యం బోనస్!