Amaran Movie Review :సినిమా: అమరన్; నటీనటులు: శివ కార్తికేయన్, సాయి పల్లవి, భువన్ అరోడ, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి; ఎడిటింగ్: ఆర్. కలైవానన్; నిర్మాత: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణాని; సినిమాటోగ్రఫీ : సీహెచ్ సాయి; విడుదల: 31-10-2024
దేశభక్తికి, శక్తియుక్తులకీ పెట్టింది పేరైన భారతీయ సైన్యం నేపథ్యంలో ఎన్నో చిత్రాలొచ్చాయి. ఆ కోవలో 2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ 'ముకుంద్ వరద రాజన్' జీవిత కథతో రూపొందిన చిత్రమే 'అమరన్'. వరదరాజన్‌గా శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయిపల్లవి నటించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
కథేంటంటే: హీరో ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) తాను సైనికుడు కావాలని ఐదేళ్ల నుంచే కలలు కంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్ఘీస్ (సాయిపల్లవి)తో ప్రేమలో పడతాడు. ఇంతలో భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్ అధికారిగా ఉద్యోగానికి ఎంపికవుతాడు. ట్రైనింగ్ అనంతరం 22 రాజ్‌పుత్ రెజిమెంట్‌లో విధుల్లో చేరతాడు. ముకుంద్ ఇంట్లో వీళ్ల ప్రేమని ఒప్పుకున్నా, ఇందు ఇంట్లో తిరస్కరిస్తారు.
అయినా ఇందు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఒక్కటవుతారు. ఆ తర్వాత ఇద్దరి వ్యక్తిగత జీవితం ఎలా సాగింది?ముకుంద్ వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నాడు? మేజర్‌గా ప్రమోషన్ వచ్చి రాజ్‌పుత్ రెజిమెంట్ నుంచి రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేషన్‌పై వచ్చాక ఆయన ఎలాంటి ఆపరేషన్లని నిర్వహించాడనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే : ముకుంద్ భార్య ఇందు కోణంలో ఈ కథ సాగుతుంది. సైనికుడి బయోపిక్ అంటే వాళ్లు నిర్వహించే ఆపరేషన్లు, కమర్షియాలిటీ కోసం మరికొన్ని కల్పిత సన్నివేశాల్ని కలుపుకొని తెరకెక్కిస్తుంటారు. కానీ, ఇది వాటికి భిన్నం. ఇందులో పూర్తిగా ముకుంద్ వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య విధులు నిర్వర్తిస్తున్న సైనికుల కుటుంబాల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది? సైనికుల త్యాగాలు ఎలా ఉంటాయి? వాళ్ల కోసం కుటుంబాలు ఎలాంటి త్యాగాలు చేస్తుంటాయన్నది ఇందులో కీలకం.
'మాదెప్పటికీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పే ఇప్పుడూ అంతే' అంటుంటారు ఇందు. ఆ మాటలతోనే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ముకుంద్, ఇందు మధ్య ప్రేమ చిగురించినప్పటి నుంచి ప్రేక్షకులు ఆ ఇద్దరితో కలిసి ప్రయాణం చేస్తారు. ఆ ఇద్దరి మనసులు కలవడం, ఆ వెంటనే ఉద్యోగం రావడంతో ఒకరికొకరు దూరంగా ఉండాల్సి రావడం, పెద్దల్ని ఒప్పించడం కోసం చేసే ప్రయత్నాల నేపథ్యం ఇలా సన్నివేశాలన్నీ సెంటిమెంట్‌గా సాగుతాయి.
ముకుంద్- ఇందు మధ్య సీన్స్ వచ్చిన ప్రతిసారీ ఆడియెన్స్ కాస్త ఎమోషనల్ అవుతారు. వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫషనల్ లైఫ్‌ను సహజంగా తెరపై ఆవిష్కరించారు. నిజంగా జరిగిన ఆపరేషన్లని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. కశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయి? సైనికులు ఆపరేషన్ల కోసం ఎలాంటి ప్లాన్స్ అమలు చేస్తుంటారో తెరపై చూపించిన తీరు ఇదివరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంది. ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ జరుగుతున్న సమయంలో వచ్చే ఆపరేషన్, క్లైమాక్స్‌లో అల్తాఫ్ వానీని అంతం చేయడం కోసం ఖాజీపత్రి ఆపరేషన్ సినిమాలు హైలైట్. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతోపాటు, దేశభక్తిని రగిలించే సైనికుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఈ సినిమాను తెరకెక్కించారు. ఎమోషన్స్‌తో ఉన్న ఈ సినిమా, మంచి చిత్రం చూశామన్న అనుభూతి కలిగిస్తుంది.
- చివరిగా:ఈ సినిమా అమరవీరుడు ముకుంద్ వరదరాజన్‌కి, దేశ ప్రజలు నా బాధ కంటే, ఆయన ధైర్యాన్ని గుర్తించాలన్న ఇందు ప్రేమకి, త్యాగానికీ గొప్ప నివాళి. భావోద్వేగాలతో బరువెక్కిన హృదయాలతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటి వస్తారు.
- గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'క' రివ్యూ - కిరణ్ అబ్బవరం కొత్త కాన్సెప్ట్ సినిమా ఎలా ఉందంటే?
'లక్కీ భాస్కర్' రివ్యూ - సినిమాకే అది హైలైట్