Software Engineer Cheated Case : అతడు ఓ సాఫ్ట్ ఇంజినీర్. ఓ అమ్మాయితో ముందు స్నేహమన్నాడు, తర్వాత ప్రేమ అన్నాడు. నుదుట సింధూరం పెట్టి పెళ్లి అయ్యిందంటూ ఆ యువతిని నమ్మించాడు. తన అవసరం తీరాక ముఖం చాటేశాడు. బాధిత యువతి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై లైంగికదాడి కేసు నమోదుచేశారు.
జూబ్లీహిల్స్ పోలీసుల కథనంప్రకారం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయి ప్రణీత్(26) 2023లో బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. అతడికి అక్కడ ప్రొస్థెటిక్ ఆర్థోటిక్ క్లినిక్‌లో పనిచేసే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే వసతిగృహంలో ఉండేవారు. ఒక రోజు అకస్మాత్తుగా యువతి తండ్రికి గుండెపోటు రావడంతో చూడటానికి ఆమె ఒడిశాకు వెళ్లింది.
పెళ్లయినట్లు నమ్మించాడు : సమయాన్ని ఆసరాగా చేసుకుని సాయి ప్రణీత్ ఆమె తండ్రి యోగక్షేమాలు తెలుసుకునే నెపంతో ఆ యువతితో తరచూ మాట్లాడేవాడు. వీరి స్నేహం ప్రేమగా మారటంతో గత జులైలో కేరళ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో ఆమె నుదుట సింధూరం పెట్టి మనకు పెళ్లయిందంటూ ఆ అమ్మాయిని నమ్మించి దగ్గరయ్యాడు. సాయి ప్రణీత్ తన కుటుంబ సభ్యులను ఒప్పించి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.
మరింత దగ్గరయ్యాడు : 2023 చివరి నెలలో ఇద్దరు కలిసి మహారాష్ట్రలోని షిరిడీకి వెళ్లారు. సాయి ప్రణీత్ అక్కడికి వచ్చిన తన తల్లిదండ్రులను, చెల్లెలిని పరిచయం ఆమెకు చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గోవాకు వెళ్లి అక్కడ ఆమెకు మరింత దగ్గరయ్యాడు. 2024లో ఆమె ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చింది. ఆమె బర్త్‌డే సందర్భంగా బెంగళూరుకు పిలిచి ఘనంగా వేడుక నిర్వహించాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు : నెల తరువాత అతడు కూడా ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చాడు. ఇద్దరు కలిసి జూబ్లీహిల్స్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని కొంతకాలం ఉన్నారు. గతేడాది నవంబరులో తన చెల్లికి పెళ్లి కుదిరిందని చెప్పి మంచిర్యాల జిల్లాలోని సొంతూరికి సాయి ప్రణీత్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమెతో ఎలాంటి సంభాషణలు జరుపలేదు. అనుమానంతో ఆమె నిలదీయగా రూ.20 లక్షలిస్తానని, తనతో బంధం తెంచుకోవాలంటూ సాయి ప్రణీత్ సూచించాడు. దీంతో యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.