Naksha Survey Begins in Telangana : ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురువుతున్నాయి. దస్త్రాల్లో కొలతలకు వాస్తవాలకు పొంతన ఉండడం లేదు. ఒకే భూమి ఎక్కువ మందికి అమ్మడం, శిఖం భూముల్ని వెంచర్లు చేసి అంటగట్టడంలాంటివి ఇబ్బందిగా మారుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ కచ్చితమైన, పారదర్శంగా ఉండే పట్టణ భూరికార్డుల నవీకరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 10 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు కింద నక్ష సర్వే జరుగుతోంది. ఏడాది కాలంలో పూర్తికానున్న ఈ సర్వే విజయవంతమైతే అన్ని మున్సిపాలిటీల్లోనూ అమలు చేయనున్నారు.
పట్టణ భూరికార్డుల నవీకరణ కింద కేంద్రం ప్రయోగాత్మకంగా చేపట్టిన నక్ష సర్వే రాష్ట్ర వ్యాప్తంగా 10 పురపాలికల్లో సాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలికలకు పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపికయ్యాయి. దీనిపై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించి సర్వే మెుదలు పెట్టారు. తొలుత ఏరియల్ సర్వే, తదుపరి క్షేత్రస్థాయి సర్వే, అనంతరం సేకరించిన వివరాలపై స్థానికుల అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులు చేస్తారు. అలావచ్చిన కచ్చితమైన వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
61 బృందాలు ఏర్పాటు : సర్వే పూర్తికి ఏడాది కాలం పట్టే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా మణుగూరు, జగిత్యాల, మహబూబాబాద్, జడ్చర్ల, మిర్యాలగూడ, వేములవాడ, హుస్నాబాద్, కొండగల్, వర్దన్నపేట, యాదగిరి గుట్టలో ఈ సర్వే నిర్వహిస్తారు. ఇందుకు మొత్తం 61 బృందాలు ఏర్పాటు చేశారు.
విజయేందిర బోయి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్
ప్రాపర్టీ కార్డులు ఇస్తారు : ఏరియల్ సర్వే కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు, 2డీ కెమెరా, ఆబ్లిక్ యాంగిల్ కెమెరా, లైడార్ సెన్సార్ లాంటి అత్యాధునిక పరికరాలు వాడుతున్నారు. ప్రతి ఇల్లు, ఆస్తి పక్కాగా సర్వే చేస్తారు. అక్షాంశాలు, రేఖాంశాలతో ఆస్తుల హద్దులు గుర్తించి వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు. అనంతరం ప్రతి ఇల్లు లేదా ఆస్తికి ప్రాపర్టీ కార్డులు ఇస్తారు. దీనివల్ల సరైన ఆధారాలు లేని ఆస్తులు, ఇళ్ల విలువ పెరుగుతుంది. ప్రభుత్వమే కార్డులు ఇవ్వడం వల్ల రుణాలకూ వీలుంటుంది. మురికివాడలు, బస్తీలు, కాలనీల్లోని చిన్నచిన్న ఇళ్లు, స్థలాలకూ పట్టాలు సిద్ధం కానున్నాయి.
సుమారు 69 రకాల వివరాలు సేకరణ : ప్రస్తుతం పట్టణ భూరికార్డుల నిర్వాహణ అందుబాటులో లేదు. ప్రభుత్వ రికార్డులు, క్షేత్రస్థాయిలో వాస్తవ కొలతల మధ్య చాలా తేడా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం లేకపోవడం వల్ల తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ భూములు నిత్యం ఆక్రమణలకు గురవుతున్నాయి. సర్వే పూర్తైతే పట్టణాల్లోని భవనాలు, వాటి కచ్చితమైన కొలతలు, రోడ్లు, చెరువులు, కాలువలు, నదులు ఇలా సుమారు 69 రకాల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
దేశవ్యాప్తంగా 152 మున్సిపాలిట్లీ నక్ష సర్వే : నక్ష అమల్లోకి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూవివాద కేసుల్ని సులువుగా పరిష్కరించవచ్చు. కచ్చితమైన ఆల్ లైన్ పట్టణ భూరికార్డులు అందుబాటులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా 152 మున్సిపాలిట్లీ నక్ష సర్వే జరుగుతోంది. ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే అధికారులు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో అమలు చేయనున్నారు.
తెలంగాణలో మరోసారి సర్వే మొదలు - ఆస్తుల వివరాలు పక్కాగా నమోదు