70th National Film Awards Best Child Artist Sreepath Malikappuram Movie : 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను తాజాగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం అవార్డును మలయాళ సినిమా ఆట్టమ్(Aattam) ముద్దాడగా, ఉత్తమ నటుడి పురస్కారం కాంతార సినిమాకుగాను రిషబ్ శెట్టికి దక్కింది. ఇక ఉత్తమ నటి పురస్కారానికి నిత్య మేనన్ (తిరుచిట్రంబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్)ను సంయుక్తంగా ఎంపిక చేశారు. అయితే వీరితో పాటు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డుకు శ్రీపథ్ అనే పిల్లవాడు ఎంపికయ్యాడు. దీంతో ఈ కుర్రాడు అందరీ దృష్టిని ఆకర్షించాడు. అలా ఇతడి గురించి అంతా ఆరా తీస్తున్నారు.
శ్రీపథ్ ఎవరంటే? - శ్రీపథ్ ఇప్పటికే ఎన్నో మలయాళ చిత్రాలలో నటించారు. అయితే వీటిలో మాలికపురం అనే సినిమా మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ సినిమాలో ఒక చిన్న అమ్మాయి(దేవానంద) శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని ఎన్నో కలలు కంటుంది. దీంతో ఆ చిన్న పిల్ల తండ్రి ఆమెను శబరిమలకు తీసుకెళ్లాలని అనుకుంటాడు. కానీ అప్పుల్లోలు చేసిన అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకుంటాడు.
దీంతో ఆ చిన్నపిల్ల ఒంటరిగా ఎంతో బాధపడుతుంది. అప్పుడు ఆ చిన్నారి కలను ఓ స్నేహితుడు(శ్రీపథ్) తీరుస్తాడు. అతడితో కలిసి దేవానంద శబరిమల ప్రయాణాన్ని చేస్తుంది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించగా బాలనటుడిగా శ్రీపథ్ నటించాడు. ఈ ముగ్గురు కలిసే శబరిమల యాత్ర చేస్తారు. అలా ఈ సినిమాలో శ్రీపథ్ నటన, ఉత్సాహం, చమత్కారమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని తన నటనకుగాను ఈ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు శ్రీపథ్.