Car Insurance Buying Guide: చాలా మంది ఇష్టంగా కారు కొనుక్కుంటారు. దానికి ఇన్సూరెన్స్‌ను చేయించుకుంటారు. ఈ వాహన బీమా- రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు చాలా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు పరిగణినలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇన్సూరెన్స్ కవరేజ్ రకాలు
కారు కొనాలని అనుకునేవాళ్లు కచ్చితంగా థర్డ్ పార్టీ, సమగ్ర వాహన బీమా గురించి తెలుసుకోవాలి. ఈ రెండింటి మధ్య తేడాలను సమగ్రంగా పరిశీలించాలి. సాధ్యమైనంతవరకు సమగ్ర వాహన బీమాను తీసుకోవడమే మంచిది.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనం, దాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇచ్చేదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. శారీరక గాయాలు, మరణం, ఆస్తి నష్టం వంటివి దీనిలో కవర్ అవుతాయి. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు. చట్ట ప్రకారం అందరూ ఈ బీమాను తీసుకోవడం తప్పనిసరి.
సమగ్ర బీమా
విస్తృత బీమా ప్రయోజనాలు కల్పించేది సమగ్ర వాహన బీమా. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.
యాడ్ ఆన్
ప్రామాణిక పాలసీకి మరికొన్ని అదనపు భద్రతను జోడించుకోవడం మంచిదే. జీరో తరుగు, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్షన్, వ్యక్తిగత ప్రమాదం వంటి ఆప్షన్లను ఎంచుకుంటే అదనపు భద్రత తోడైనట్లే. వీటితో ప్రీమియం పెరిగినా, అత్యవసర సమయంలో విలువైన ప్రయోజనాలను అందిస్తాయి.
పాలసీ మినహాయింపులు
మెకానికల్ బ్రేక్ డౌన్లు, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ప్రమాదం తర్వాత ఇంజిన్ వైఫల్యం వంటివాటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు.
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అధికంగా ఉన్న బీమా సంస్థలను ఎంచుకుంటే పాలసీ క్లెయిమ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. పాలసీ నాణ్యతను అంచనా వేయడానికి సీఎస్ఆర్ నిష్పత్తి ఒక ప్రమాణం. అందుకే పలు బీమా సంస్థలు అందిస్తున్న సీఎస్ఆర్ను పరిశీలించండి.
మినహాయింపులు
మినహాయింపు అంటే పాలసీదారుడు క్లెయిమ్ సమయంలో తన వాటాను కూడా కొంత శాతాన్ని చెల్లిస్తారు. పాలసీ రెన్యువల్ సమయంలో స్వచ్ఛంద మినహాయింపును ఎంచుకోవడం వల్ల బీమా ప్రీమియం కొద్దిగా తగ్గుతుంది. కానీ, క్లెయిమ్ సమయంలో ఈ మేరకు మొత్తాన్ని మీరు సొంతంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ మినహాయింపును జాగ్రత్తగా ఎంచుకోండి.
నెట్‌వర్క్ గ్యారేజీలు
ఆరోగ్య బీమా సంస్థల పరిధిలో ఎలా నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఉంటాయో, కారు బీమా సంస్థల పరిధిలో నెట్ వర్క్ గ్యారేజీలు ఉంటాయి. బీమా సంస్థలతో అనుసంధానం అయి ఉండే వీటిని నెట్‌వర్క్ గ్యారేజీలు అంటారు. బీమా చేసిన వ్యక్తి దగ్గర డబ్బు తీసుకోకుండానే క్లెయిమ్‌కు వచ్చినపుడు గ్యారేజ్ వద్ద కార్లు రిపేర్ చేస్తాయి. రిపేరింగ్ ఖర్చును బీమా సంస్థ భరిస్తుంది. దీంతో రిపేర్ కోసం ముందస్తు చెల్లింపు, రీయింబర్స్‌మెంట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
నో క్లెయిమ్ బోనస్
బీమా తీసుకున్న తర్వాత ఏడాదిలో ఒక్కసారి కూడా దాన్ని వినియోగించుకోకపోతే నో క్లెయిమ్ బోనస్ పొందొచ్చు. దీంతో తర్వాతి ఏడాది ప్రీమియంలో రాయితీ లభిస్తుంది. దాదాపు 50 శాతం వరకు రాయితీ పొందొచ్చు. మీరు బీమా సంస్థలను మార్చినా, పాలసీని గడువు కన్నా ఆలస్యంగా రెన్యువల్ చేసినా ఈ రాయితీ రాదు.
ప్రీమియం వర్సెస్ కవరేజ్ బ్యాలెన్స్
ప్రీమియం ఆధారంగా ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవద్దు. చౌకైన పాలసీకి తగిన కవరేజ్ ఉండకపోవచ్చు.
పాలసీ నిబంధనలు, షరతులు
మీరు కారు ఇన్సూరెన్స్‌ను తీసుకున్నప్పుడు బీమా సంస్థ నియమ, నిబంధనలను పూర్తిగా చదవండి. బీమా కవరేజీ, డాక్యుమెంటేషన్ తదితర వివరాలను తెలుసుకోండి. లేదంటే బీమా క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
కస్టమర్ సర్వీస్, రివ్యూలు
పాలసీదారుడికి స్పందించే కస్టమర్ సర్వీస్ ఉన్న బీమా సంస్థలను ఎంచుకోవడం ఉత్తమం. మార్కెట్లో మంచి పేరు, ట్రాక్ రికార్డు ఉన్న బీమా సంస్థల్లో కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం మంచిది.