What Is Free Look Period In Insurance :మనలో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. తీరా తీసుకున్న తరువాత అందులోని షరతులు, నిబంధనలు నచ్చకపోతే పరిస్థితి ఏమిటి? మీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అవి పెద్దగా ఉపయోగపడవని తెలిస్తే, అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఫ్రీ-లుక్ పీరియడ్
ఇన్సూరెన్స్ పాలసీని వెనక్కి ఇచ్చేయడానికి మీకు 30 రోజుల వరకు వ్యవధి ఉంటుంది. పాలసీదారులు తాము తీసుకున్న పాలసీని నిశితంగా పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ పరిభాషలో దీన్నే 'ఫ్రీ-లుక్ పీరియడ్' అని పిలుస్తుంటారు.
జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్న తర్వాత ఈ 30 రోజుల వ్యవధిలో పాలసీదారుడు, తాను తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీని రద్దు చేసుకుని, కొన్ని ఖర్చులు మినహా పూర్తి ప్రీమియాన్ని తిరిగి పొందేందుకు వీలవుతుంది. పాలసీ నిబంధనలు, షరతులను సమీక్షించేందుకు ఇచ్చిన ఈ సమయంలో పాలసీదారులు ఆ పాలసీతో సంతృప్తి చెందితేనే దాన్ని కొనసాగించవచ్చు. లేకపోతే రద్దు చేసుకోవచ్చు. అందుకే ఈ సదుపాయం గురించి కొత్తగా పాలసీ తీసుకునేవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
నష్టం వాటిల్లకుండా
పాలసీ నచ్చకపోతే, దాన్ని రద్దు చేసుకునే వీలును పాలసీదారుకు కల్పించడమే ఈ ఫ్రీ-లుక్ వ్యవధి ప్రధాన లక్ష్యం. 30 రోజుల వ్యవధిలో రద్దు చేసుకున్నప్పుడు పాలసీదారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇది కాపాడుతుంది. పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వ్యవధి తోడ్పడుతుంది. పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను సలహాదారులు, బీమా సంస్థలు దాచి పెట్టే అవకాశం ఉంది. తీరా పాలసీ వచ్చాక ఆ షరతులు కనిపిస్తుంటాయి. చెప్పిన విషయాలకూ, పాలసీలో పేర్కొన్న అంశాలకు చాలా వ్యత్యాసం ఉండవచ్చు. ఇలాంటప్పుడు నిర్ణీత వ్యవధిలోగా పాలసీని వెనక్కి ఇచ్చేయవచ్చు. ఇలాంటప్పుడు మీరు చెల్లించిన ప్రీమియాన్ని బీమా సంస్థ వాపసు ఇస్తుంది.