Student Loan Repayment Strategy : ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఫీజులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు స్టూడెంట్ లోన్ తీసుకుంటారు. విదేశీ విద్య ఖరీదైనది కావడం వల్ల చాలా మందికి స్టూడెంట్ లోన్ తప్ప మరో మార్గం ఉండదు. విదేశాల్లో ఎడ్యుకేషన్ పూర్తి కాగానే అసలు కథ మొదలవుతుంది. స్టూడెంట్ లోన్‌ను తీసుకున్న విద్యార్థులు దాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంతోమంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇటువంటి సమయంలో స్టూడెంట్ లోన్ రీపేమెంట్ ప్రక్రియను సులభతరం చేసే కొన్ని మార్గాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇంతకీ అవేంటో ఈ కథనంలో చూద్దాం.
4 ఆప్షన్స్!
స్టూడెంట్ లోన్‌ను బ్యాంకులకు తిరిగి చెల్లించేందుకు ప్రాథమికంగా నాలుగు ప్లాన్లు ఉన్నాయి. అవి:
- పే యాజ్ యు ఎర్న్ (PAYE)
- ఇన్‌కమ్ కంటింజెంట్ రీపేమెంట్ (ICR)
- రివైజ్డ్ పే యాజ్ యు ఎర్న్ (REPAYE)
- ఇన్‌కమ్ బేస్డ్ రీపేమెంట్ (IBR)
ఈ నాలుగు పద్ధతులు కూడా విద్యార్థుల లోన్ రీపేమెంట్ ప్రక్రియను ఈజీగా మార్చగలవు. అయితే ఈ కథనంలో మనం పే యాజ్ యు ఎర్న్, ఇన్‌కమ్ కంటింజెంట్ రీపేమెంట్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం. వీటిలో దేనివల్ల విద్యార్థులకు అధిక ప్రయోజనం దక్కుతుందనేది చూద్దాం.
బ్యాంకులు ఏం చేస్తాయంటే?
విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులందరి ఆర్థిక నేపథ్యాలు ఒకేలా ఉండవు. ఆర్థిక బలహీనవర్గాల వారు కూడా చాలామంది ఉంటారు. స్టూడెంట్ లోన్‌ను తిరిగి చెల్లించే క్రమంలో వారు ఇబ్బందిపడుతుంటారు. ఈ అంశం బ్యాంకులకు కూడా బాగా తెలుసు. అందుకే అవి విద్యార్థుల ఆర్థిక స్థితిగతులు, నేపథ్యం ఆధారంగా లోన్ రీపేమెంట్ ప్లాన్‌ను సిఫారసు చేస్తుంటాయి. సాధారణంగానైతే లోన్ రీపేమెంట్ ప్లాన్ 10 సంవత్సరాలకు పైనే ఉంటుంది. స్టూడెంట్ లోన్ తీసుకున్న విద్యార్థి విదేశంలో కోర్సును పూర్తి చేయగానే, ప్రతినెలా అతడి అకౌంట్ నుంచి ఈఎంఐలు కట్ కావడం మొదలవుతుంది. ఈక్రమంలో సదరు విద్యార్థికి వస్తున్న నెలవారీ ఆదాయం, ఆ సమయానికి కుటుంబ సభ్యుల సంఖ్యను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ అంశాల ఆధారంగా ఈఎంఐను నిర్ణయిస్తాయి.
పే యాజ్ యు ఎర్న్ (PAYE) ప్లాన్
విద్యార్థి విదేశంలో చదువును పూర్తి చేశాక, తక్కువ శాలరీ ఉన్న జాబ్‌లో చేరినా ఇబ్బంది ఉండొద్దంటే పే యాజ్ యు ఎర్న్ (PAYE) ప్లాన్ ఉత్తమమైనది. సదరు విద్యార్థికి వచ్చే నెలవారీ ఆదాయంలో 10 శాతాన్ని మాత్రమే ఈఎంఐగా కట్ చేస్తారు. దీనివల్ల ఆదాయంలోని మిగతా డబ్బులను ఇతరత్రా ఖర్చుల కోసం విద్యార్థి వాడుకోవచ్చు. ఏమాత్రం ఒత్తిడి లేకుండా గరిష్ఠంగా 20 ఏళ్ల పాటు లోన్‌ను రీపే చేయొచ్చు. ఆ తర్వాత మిగిలే లోన్ మొత్తాన్ని మాఫీ చేస్తారు. అయితే పన్ను వేయదగిన ఆదాయం (ట్యాక్సబుల్ ఇన్‌కమ్) ప్రాతిపదికన చివర్లో రుణమాఫీ ప్రక్రియ జరుగుతుంది. లోన్‌కు సంబంధించిన వడ్డీపైనా రాయితీ లభిస్తుంది. సబ్సిడీపై మంజూరయ్యే స్టూడెంట్ లోన్లకు సంబంధించిన ఈఎంఐలపై వడ్డీలు కవర్ కాకుంటే, వాటిని మూడేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. 2007 అక్టోబరు 1 తర్వాత లోన్స్ తీసుకొని, కనీసం ఒక లోన్ డిస్బర్స్‌మెంట్ 2011 అక్టోబరు 1 తర్వాత జరిగి ఉంటే PAYE రీపేమెంట్ ప్లాన్ ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఈ ప్లాన్‌లో డైరెక్ట్ లోన్స్, డైరెక్ట్ సబ్సిడైజ్డ్ లోన్స్, డైరెక్ట్ అన్ సబ్సిడైజ్డ్ లోన్స్, డైరెక్ట్ ప్లస్ లోన్స్ కవర్ అవుతాయి. ఈ లోన్ రీపేమెంట్ ప్లాన్‌కు సంబంధించిన అర్హతలు కఠినతరంగా ఉంటాయి.
ఇన్‌కమ్ కంటింజెంట్ రీపేమెంట్ (ICR) ప్లాన్
స్టూడెంట్ లోన్‌కు సంబంధించిన మరో ఆకర్షణీయమైన రీపేమెంట్ ప్లాన్ ‘ఇన్‌కమ్ కంటింజెంట్ రీపేమెంట్’ (ICR). దీనికి సంబంధించిన అర్హతా నిబంధనలు మరీ అంత కఠినంగా ఉండవు. అందుకే దీన్ని చాలా మంది వాడుకుంటారు. ఇందులో భాగంగా విద్యార్థి విదేశాల్లో చదువును పూర్తి చేశాక, ప్రతినెలా అతడి ఆదాయంలో 20 శాతాన్ని ఈఎంఐగా వసూలుచేస్తారు. ఈ నిర్దిష్ట మొత్తాన్ని బ్యాంకు 12 ఏళ్లపాటు ప్రతినెలా వసూలు చేస్తుంది. 25 ఏళ్లపాటు సక్రమంగా లోన్ పే చేశాక, ఇంకా ఏమైనా బకాయిలు మిగిలితే వాటిని బ్యాంకు మాఫీ చేస్తుంది. ICR లోన్ రీపేమెంట్ ప్లాన్‌కు విద్యార్థులంతా అర్హులే. అన్ని రకాల డైరెక్ట్ లోన్స్, పేరెంట్ ప్లస్ లోన్స్ దీని కింద కవర్ అవుతాయి. PAYE రీపేమెంట్ ప్లాన్‌తో పోలిస్తే ఇందులో ఈఎంఐ కొంచెం ఎక్కువగా ఉంటుంది. PAYE ప్లానుతో పోలిస్తే ICR ప్లానులో రుణమాఫీ ఐదేళ్లు ఆలస్యంగా జరుగుతుంది. దీనివల్ల లోన్ రీపేమెంట్ మొత్తం పెరుగుతుంది.
ఏ ప్లాన్ బెస్ట్?
చదువు పూర్తి చేశాక నెలవారీ ఆదాయం తక్కువగా ఉంటుందని భావించే వారికి PAYE లోన్ రీపేమెంట్ ప్లాను ఉత్తమమైంది. ఎందుకంటే ఇందులో నెలవారీ ఈఎంఐ తక్కువగా ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత లోన్ మాఫీ కూడా అయిపోతుంది. అయితే PAYE లోన్ రీపేమెంట్ ప్లానుకు అర్హత లేని వారికి ICR ప్లాన్ బెస్ట్. పేరెంట్ ప్లస్ లోన్స్ తీసుకునే వారికి ICR ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.