Industrialist VC Janardhan Rao Murder Case Update : హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును (86) సొంత మనువడి చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కిలారు కీర్తి తేజను ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక వివరాలు సేకరించారు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో తాతను కక్షతో కీర్తి తేజ చంపాడు. జనార్దన్ రావును చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు.
పోలీసులకు సహకరించకుండా వింత చూపులు : హత్య జరిగిన రోజే నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇతని నుంచి హత్య విషయంలో మరింత సమాచారం సేకరించడానికి నిందితున్ని పంజాగుట్ట పోలీసులు కష్టడీకి తీసుకున్నారు. మొదటిరోజు పోలీసులకు సహకరించకుండా వింత చూపులు చూస్తూ తనలో మాట్లాడినా ఆ తర్వాత హత్యకు దారితీసిన పరిస్థితులను పోలీసు అధికారుల ఎదుట వివరించినట్టు సమాచారం.
కష్టడీలో కీర్తితేజ చెప్పిన విషయాలు : యూ బెగ్గర్ అంటూ తాత ప్రతిరోజూ అవమానించేవాడని ఏరోజూ తనని సొంత మనిషిగా చూడలేదని కీర్తి తేజ పోలీసుల విచారణలో తెలిపాడు. తనను కుటుంబ సభ్యుడిగా కూడా ఏనాడూ చూడలేదని తెలిపాడు. అందరి కంటే హీనంగా చూసేవాడని ప్రతిరోజూ నన్ను బెగ్గర్ అనే పిలిచేవాడని చెప్పాడు. ఆఫీసులో కూడా అందరి ముందు అవమానించేవాడని దీంతో ఆఫీస్ వారు కూడా చిన్నచూపు చూసేవారన్నారు.
"ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లోనూ తక్కువ చేశారు. చివరకు డైరెక్టర్ పదవి కూడా నాకు ఇవ్వలేదు. అప్పటి నుంచి నాకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయి. అందుకే చంపేయాలని నిర్ణయించుకున్నా. ఇన్‌స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశా. హత్య జరిగిన రోజు నాకు, తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఇవ్వను అన్నాడు. కోపంతో కత్తితో కసితీరా పొడిచా. హత్య చేసిన తర్వాత బీఎస్ మక్తా ఎల్లమ్మగూడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో ఉన్న నా బట్టలను తగలబెట్టా"- పోలీసుల విచారణలో కీర్తి తేజ, నిందితుడు
పారిశ్రామికవేత్త వీసీ జనార్ధన్ రావు దారుణ హత్య - 73సార్లు కత్తితో పొడిచి చంపిన మనవడు
నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు - హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు