తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ కార్ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ రిజెక్ట్ కాకూడదా? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే! - CAR INSURANCE CLAIM - CAR INSURANCE CLAIM

Ways To Avoid Car Insurance Claim Rejection : రోడ్డుపై వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాహనానికి, అవతలి వారికి జరిగిన ఆర్థిక నష్టానికి వెహికల్ ఇన్సూరెన్స్​ పరిహారం అందిస్తుంది. కానీ మనం తెలిసీ, తెలియక చేసే కొన్ని పొరపాట్లు వల్ల వాహన బీమా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

car insurance
car insurance (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 2:22 PM IST

Ways To Avoid Car Insurance Claim Rejection : రోడ్డుపై వెళ్లేటప్పుడు అశ్రద్ధగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాహనానికి, అవతలి వారికి జరిగిన ఆర్థిక నష్టానికి వాహన బీమా పరిహారం అందిస్తుంది. అయితే వాహనదారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్నిసార్లు బీమా సంస్థలు క్లెయిమ్​ను తిరస్కరించే అవకాశాలుంటాయి. అవేమిటి? ఆ తప్పులను నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

బీమాను పునరుద్ధరించుకోవాల్సిందే!
బీమా పాలసీ లేకుండా వాహనం రోడ్డు మీదకు రాకూడదు. భారతదేశంలో వాహనం కొనుగోలు చేసేటప్పుడు, దానికి ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవడం తప్పనిసరి. కానీ, పునరుద్ధరణ విషయంలోనే చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. కొంత మంది ఇన్సూరెన్స్​ పాలసీని పునరుద్ధరించుకోవడం మర్చిపోతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే దాని తీవ్రతను అర్థం చేసుకుంటారు. ప్రమాదం జరిగిన క్షణం వరకూ పాలసీ అమల్లో ఉంటేనే బీమా కంపెనీ క్లెయిమ్​ చెల్లిస్తుంది. కాబట్టి, బీమా పాలసీ గడువు ముగియక ముందే దాన్ని పునరుద్ధరించుకోవడం మంచిది. ప్రస్తుతం బీమా సంస్థలు వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా పాలసీని పునరుద్ధరణ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇన్సూరెన్స్​ కంపెనీ అందించే యాప్‌ను తప్పనిసరిగా ఫోన్‌లో ఉంచుకోవాలి. క్లెయిమ్​ దాఖలు చేయడం సహా, ఎప్పటికప్పుడు దాని స్థితిని తెలుసుకునేందుకు, సందేహాలను తీర్చుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

పూర్తి స్థాయి బీమా ఉంటేనే!
వాహన బీమా పాలసీలో రెండు విభాగాలుంటాయి. ఒకటి థర్డ్‌ పార్టీ బీమా. అంటే మన వాహనం ద్వారా వేరే వ్యక్తులకు, ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు వర్తిస్తుంది. వాహనానికి ఈ బీమా పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిందే. మీ వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లితే ఈ బీమా పరిహారం ఇవ్వదు. దీని కోసం ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఉండే ఓన్‌ డ్యామేజ్‌ పాలసీ తీసుకోవాల్సిందే. కొంత మంది థర్డ్‌ పార్టీ బీమా తీసుకొని, వాహనానికి జరిగిన నష్టానికి క్లెయిమ్​ చేస్తుంటారు. కానీ పూర్తి స్థాయి పాలసీ తీసుకుంటే, ప్రమాదాలతోపాటు, వరదలు, తుపానులు, భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటంలాంటి సందర్భాల్లోనూ వాహనానికి జరిగిన నష్టానికి పరిహారం పొందవచ్చు

సరైన పత్రాలు లేకుండా
కొంత మంది సరైన డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపుతారు. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, అప్పుడు బీమా సంస్థ పరిహారం ఇవ్వదు. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం, చెల్లుబాటులో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడపకూడదు. వాహనానికి కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రము కూడా ఉండాలని కొన్ని బీమా సంస్థలు చెబుతున్నాయి.

మద్యం మత్తులో
మద్యం సేవించి వాహనం నడపడం నేరం. ఇలాంటి సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అంతేకాదు వాహనానికి జరిగిన నష్టానికి కూడా పరిహారం ఇవ్వడానికి బీమా సంస్థలు నిరాకరిస్తాయి.

వెంటనే సమాచారం ఇవ్వకపోతే?
ప్రమాదం జరిగినప్పుడు, వెంటనే ఆ విషయాన్ని బీమా సంస్థకు తెలియజేయాలి. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా సొంతంగా మరమ్మతులు చేయిస్తుంటారు. తర్వాత క్లెయిమ్ దాఖలు చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. సలహా కేంద్రం చెప్పిన సూచనలను కచ్చితంగా పాటించాలి. ఇప్పుడు కొన్ని బీమా సంస్థలు యాప్‌లోనే ప్రమాదానికి సంబంధించిన వివరాలు, పాడైన వాహనం చిత్రాలు, వీడియోలను పంపించాలని అంటున్నాయి.

కొంతమంది సొంత వాహనంగా తీసుకొని, అద్దెకు తిప్పుతుంటారు. వాస్తవానికి పాలసీలో పేర్కొన్న అవసరాలకు మాత్రమే వాహనాన్ని వినియోగించాలి. వాహనాన్ని ఏ రకంగా వాడుతున్నారన్న దానిపై ఆధారపడి ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి బీమా సంస్థలు. కాబట్టి, వ్యక్తిగత వాహనాన్ని వాణిజ్య అవసరాల కోసం వాడిన సందర్భాల్లో, ప్రమాదం జరిగితే బీమా సంస్థ పరిహారాన్ని నిరాకరించవచ్చు.

వాహన బీమాలో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. పాలసీ తీసుకునేటప్పుడు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రాథమిక పాలసీతోపాటు, అనుబంధాల పాలసీలను లేదా రైడర్లను జోడించుకుంటే, అవసరాన్ని బట్టి, వాటిని క్లెయిమ్​ చేసుకోవచ్చు. క్లెయిమ్​ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగాలంటే, బీమా సంస్థ నెట్‌వర్క్‌ కేంద్రంలోనే వాహనాన్ని మరమ్మతు చేయించుకోవడం ఉత్తమం. అలాకాకుండా మీరు సొంతంగా వేరే దగ్గర రిపేర్ చేయిస్తే, క్లెయిమ్​ ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన బిల్లులన్నింటినీ సమర్పించాలి. బీమా సంస్థ ఆ వివరాలను పరిశీలించి, పరిహారం అందిస్తుంది.

కొత్త కారు కొనాలా? ఈ 'ఎక్స్​ట్రా ఖర్చులు' గురించి కచ్చితంగా తెలుసుకోండి! - Car Expenditure

మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలా? టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Family Cars

ABOUT THE AUTHOR

...view details