Unlimited Health Insurance : ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందరికీ అవసరమే. అయితే నిర్దిష్ట మొత్తంలో కవరేజీని అందించే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కంటే ‘అన్ లిమిటెడ్’ కవరేజీని అందించే పాలసీలు బెటర్. మన వైద్య చికిత్సలకు ఎంత ఖర్చయినా ఈ పాలసీలు కవరేజీని అందిస్తాయి. దీనివల్ల మనకు ఆపత్కాలంలో ఆరోగ్య భద్రతతో పాటు ఆర్థిక భరోసా లభిస్తుంది. తద్వారా అనూహ్యంగా అలుముకున్న కష్టకాలాన్ని మనం సమర్ధంగా ఎదురీదగలుగుతాం. అందుకే అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
పెద్ద ఆరోగ్య సమస్య చుట్టుముడితే
ఆరోగ్య సమస్యలు మనకు చెప్పిరావు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య చుట్టుముడితే వైద్యచికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారికి ఈ పరిస్థితి పెద్ద సవాల్‌గా మారుతుంది. కానీ పాలసీ ఉన్నవాళ్లకు ఏ బెంగా ఉండదు. ఎందుకంటే, వారి వైద్య ఖర్చులు భరించడానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందించిన సంస్థ రెడీగా ఉంటుంది. తక్కువ వైద్యఖర్చులకు సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సరిపోతాయి. కానీ భారీగా ఖర్చయ్యే వైద్యం చేయించుకోవాల్సి వస్తే ‘అన్ లిమిటెడ్’ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉపయోగపడతాయి. వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న వారు, ఇప్పటికే జీవనశైలి వ్యాధులు కలిగిన వారు ఈ తరహా పాలసీలు తీసుకోవడం శ్రేయస్కరం. ప్రస్తుతం బీమా మార్కెట్‌లో అన్‌లిమిటెడ్ కవరేజీని అందిస్తున్న ఆరోగ్య బీమా పాలసీలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలో బెటర్‌గా ఉన్నదాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా నేర్పిన పాఠాలతో
సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీలు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.25 లక్షలు, రూ.1 కోటి అంతకంటే ఎక్కువ కవరేజీతో వస్తుంటాయి. అపరిమిత కవరేజీని అందించే పాలసీని తీసుకుంటే, ఖర్చు గురించి మనం మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఆ విషయాన్ని ఆరోగ్య బీమా సంస్థ చూసుకుంటుంది. వైద్యుల సూచనల మేరకు సంవత్సరంలో ఎన్నిసార్లయినా మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ ఎలా ఉంటుందనే విషయాన్ని మన దేశ ప్రజలు కరోనా సంక్షోభ సమయంలో కళ్లారా చూశారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నవారు ఆ టైంలో నిశ్చితంగా వైద్యచికిత్సలు చేయించుకోగలిగారు.