Stock Market All Time High :శుక్రవారందేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1444 పాయింట్లు లాభపడి రూ.73,089 వద్దకు చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 429 పాయింట్లు వృద్ధిచెంది 22,126 వద్ద జీవన కాల గరిష్ఠాలను తాకింది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 604 పాయింట్లు పెరిగి 72,249 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 200 పాయింట్లు పుంజుకొని 21,898 వద్ద కొనసాగుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టాటా, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీ, నెస్లేఇండియా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇంట్రాడేలో రిలయన్స్ షేర్ రూ.2,949.80 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఈ ఒక్కరోజే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.52,000 కోట్లు పెరగడం విశేషం.
కలిసొస్తున్న సానుకూల సంకేతాలు!
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎలాంటి అద్భుతమైన ప్రకటనలు లేకపోవటం కారణంగా గురువారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య మార్కెట్లు చలించాయి. కానీ శుక్రవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. కేంద్రం మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి తాయిలాలు, జనరంజక ప్రకటనల జోలికి వెళ్లకపోవటం వల్ల మరోసారి సుస్థిర ప్రభుత్వం ఖాయమనే సంకేతాలు బలంగా వెళ్లాయి. ఇది కూడా సూచీల దూకుడుకు ఒక కారణంగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.