Tax Benefits For Senior Citizens : పదవీ విరమణ సమయం ప్రయోజనాలతో పాటు సవాళ్లను సైతం తెస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబారాగా ఖర్చు చేస్తే, తర్వాతి కాలంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలా కావొద్దంటే పొదుపు, పెట్టుబడులు పెట్టడం లాంటివి చేయాలి. రిటైర్ అయిన తర్వాత మిగిలిన శేష జీవితం హాయిగా సాగిపోవాలంటే, ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరం. కాబట్టి, ఎలాంటి ఆందోళన, ఒత్తిడి లేని పదవీ విరమణ కోసం మంచి పెట్టుబడి పెట్టడం సరైన మార్గం.
అయితే పెట్టుబడిలో పన్ను ఆదా అనేది కీలకమైన అంశం. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వంతో పాటు పలు బ్యాంకులు సైతం సీనియర్ సిటిజెన్స్ కోసం మంచి వడ్డీతో కూడిన పొదుపు, పెట్టుబడి పథకాలు అందిస్తున్నాయి. అలా మీ అవసరాలకు అనుగుణంగా ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే ఈ ఏడాది అందుబాటులో ఉన్న బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ పథకాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
- ELSS మ్యూచువల్ ఫండ్స్ : పన్ను ఆదా చేసే పెట్టుబడి పథకాల్లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఒకటి. వీటినే ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అంటారు.మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ద్రవ్యోల్బణం ఉన్న స్థితిలోనూ రాబడి వస్తుంది. రెండోందిగా ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80సీ ప్రకారం పన్ను ఆదా అవుతుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సిప్ లేదా ఏక మొత్తం ద్వారా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు. సీనియర్ సిటిజన్లు తమ మూల ధనాన్ని పెంచుకోవడానికి ఈ ఫండ్స్ సహాయ పడతాయి. కాబట్టి సరైన మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మేలు పొందవచ్చు.
- ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) : సీనియర్ సిటిజెన్స్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న మరో మంచి పథకం ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). ఇవి అత్యంత సురక్షితం. సీనియర్ సిటిజెన్లకు బ్యాంకులు ఎఫ్డీలపై సాధారణం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. సాధారణంగా వడ్డీ రేటు 5.5% నుంచి 7.75% మధ్య ఉంటుంది. ఇందులో ఆదాయం రావడం మాత్రమే కాకుండా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ.5 లక్షల వరకు బీమా కవరేజి అందుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపన్ను చట్టం ప్రకారం రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే వీటిపై వచ్చే వడ్డీకి మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడికి ఈ ఆప్షన్ బెస్ట్.
- ప్రభుత్వ బాండ్లు : సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ బాండ్లు మంచి పెట్టుబడి ఎంపిక. ఎందుకంటే ఇందులో ఆదాయ గ్యారెంటీతో పాటు రాబడికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఈ బాండ్లలో 10 నుంచి 15 సంవత్సరాల కాలపరిమితి వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఇవి మంచి క్రెడిట్ రేటింగ్లు, మెరుగైన లిక్విడిటీని కలిగి ఉండటంతో పాటు మంచి రిటర్న్ వస్తాయి. డీమాట్ అకౌంట్ కలిగి ఉండాల్సిన ఎక్స్ఛేంజీలలో ఈ బాండ్ల క్రయవిక్రయాలు చేయవచ్చు. ఈ బాండ్లు సాధారణంగా మార్కెట్ పరిస్థితులను బట్టి 5.5% నుంచి 7.5% వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి.
- ప్రధాన మంత్రి వయో వందన యోజన : ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) అనేది 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం. వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించాలనేది దీని లక్ష్యం. ఈ పథకం ఎల్ఐసీలో కొంత మొత్తంతో సబ్స్క్రిప్షన్ ద్వారా పెన్షన్ అందించడం ద్వారా వారికి ఆదాయ భద్రతను కల్పిస్తుంది. కనీస పాలసీ ధర రూ.1.5 లక్షలు. ఇందుకు నెలకు వెయ్యి రూపాయలు వస్తుంది. కాగా పాలసీ తీసుకునే సమయంలో చందాదారులు ఎంచుకున్న ప్లాన్ (నెలవారీ/త్రైమాసిక/అర్ధ-వార్షిక/సంవత్సరం) ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. పాలసీ వ్యవధి 10 ఏళ్లు. ఇందులో రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిని బట్టి పెన్షన్ నెలకు రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు పొందవచ్చు.
- నేషనల్ పెన్షన్ సిస్టం (NPS) : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అనేది ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. దీన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. ప్రైవేటు ఉద్యోగుల కోసం దీన్ని 2009లో ప్రారంభించారు. కానీ, ఇప్పుడు 18 నుంచి 70 ఏళ్ల వయసు గల పౌరులందరికీ అందుబాటులో ఉంది. దీని ద్వారా ఆదాయపన్ను చట్టం సెక్షన్లు 80 సీసీఈ, 80సీసీడీ (1) కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంతే కాకుండా సెక్షన్ 80 సీసీడీ (1 బీ) కింద అదనంగా రూ. 50 వేల వరకు మినహాయింపు లభిస్తుంది. ఇందులో పెట్టుబడి మొత్తంలో 25 శాతం వరకు ఎలాంటి పన్ను లేకుండా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. గరిష్ఠంగా 60 శాతం తీసుకోవచ్చు.
- బీమా పథకాలు : హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఆరోగ్యం కోసమే కాదు, మనల్ని పన్ను నుంచి కూడా కాపాడుతుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లు అయితే రూ. 30 వేలు, ఇతర పౌరులకు అయితే రూ.20 వేల వరకు పరిమితి ఉంటుంది. సరైన పథకాన్ని ఎంచుకుంటే రక్షణతో పాటు పన్ను ఆదా కూడా లభిస్తుంది.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. స్కీమ్ టర్మ్ 15 ఏళ్లు కాగా, పథకం ప్రారంభించిన ఆరో ఏట నుంచి కొంత మొత్తం నగదు విత్ డ్రా చేసుకునే అవకాశముంది. పీపీఎఫ్ ద్వారా సాధారణ ఆదాయం రాదు కానీ, ఈ పథకం వల్ల వచ్చే ప్రయోజనం పూర్తిగా టాక్స్ ఫ్రీ. ఇది అందరికీ అందుబాటులో ఉన్న సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఒకటి.
ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే! మిగతా టాప్-6 ఏవంటే?
సీనియర్ సిటిజన్లు ఇలా ITR దాఖలు చేస్తే ఫుల్ బెనిఫిట్స్! - itr filing 2024