Businessman Kidnapping And Murder Case : కొనుగోలు చేసిన సరుకుకు సొమ్ము చెల్లిస్తామని వ్యాపారిని రప్పించారు. అతడినే బంధించి భారీ ఎత్తున డబ్బు కాజేశారు. విషయం బయటపడితే పోలీస్ కేసు తప్పదనే ఉద్దేశంతో వ్యాపారిని హత్య చేశారు. సికింద్రాబాద్ విక్రమ్‌పురీ కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్ అహ్మద్ ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు. నిందితుడికి సహకరించిన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వ్యాపారి హత్య కేసు : సికింద్రాబాద్ కార్ఖానా విక్రమ్‌పురీ కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేశ్ రెండు రాష్ట్రాల్లో పాన్ మసాలా దుకాణాలకు సరుకు సరఫరా చేస్తుంటారు.పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. పాన్ మసాలా ప్యాకెట్లను కొనుగోలు చేసి దుకాణాలకు విక్రయించే చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ సజ్జాద్ అహ్మద్‌ఖాన్ ముఠా కొద్ది రోజుల క్రితం రమేశ్‌ను సంప్రదించారు. అతడి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన పాన్ మసాలా కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన నగదు చెల్లింపులపై నిందితులు రేపూమాపంటూ వాయిదా వేస్తూ వచ్చారు.
నగదు విషయంపై ఇద్దరి మధ్య గొడవ : ఈ నెల 18 ఉదయం డబ్బు తీసుకునేందుకు కాచిగూడ రప్పించగా, నగదు విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో రమేశ్ ఒంటరిగా ఉన్నాడని అతడిని బెదిరించి డబ్బు గుంజేందుకు సిద్ధమయ్యారు. కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. చంపుతారని భయపడిన వ్యాపారి, స్నేహితుడి ద్వారా ఆ నగదును బదిలీ చేయించాడు. డబ్బు తీసుకున్నాక వదిలేయమని ప్రాధేయపడ్డాడు. ప్రాణాలతో వదిలితే డబ్బు కాజేసిన విషయం బయటపడుతుందని భావించిన నిందితులు వ్యాపారి కాళ్లు, చేతులు కట్టి కారులో బంధించారు.
టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి : రమేశ్‌ను కారులోకి ఎక్కించుకున్న నలుగురు నిందితులు ఏపీ, తెలంగాణ సరిహద్దులో హత్య చేయాలని భావించారు. కాచిగూడ నుంచి ఖమ్మం వెళ్లి అక్కడ నుంచి కోదాడ చేరారు. మరోసారి ఖమ్మం వైపు బయల్దేరి మార్గమధ్యలో కోక్యా తాండా సమీపంలోకి రాగానే కారులోనే వ్యాపారి మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేశారు. మరణించినట్లు నిర్దారించుకున్నాక మృతదేహాన్ని మిరప తోట మధ్యకి తీసుకెళ్లారు. గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా ముఖంపై రాళ్లతో కొట్టి ఛిద్రం చేసి మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు.
నిందితుడు సయ్యద్ సజ్జాద్‌ఖాన్ : వ్యాపారి సెల్‌ఫోన్లను ఖమ్మం, కోదాడ, హైదరాబాద్ మార్గాల్లో పడేసి పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేశారు. ఈ నెల 19న వ్యాపారి భార్య జనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్, సెల్‌ఫోన్ ఆధారంగా ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి గురించి అడగగా హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో హత్య, మోసం కేసులు ఉన్నట్లు గుర్తించారు.
'డెడ్ బాడీని ఎలా మాయం చేయాలి?' - అంతర్జాలంలో వెతికి ఆనవాళ్లు లేకుండా చేశాడు
రూ.1000 కోసం ఇద్దరు స్నేహితుల హత్య - కోపంతో ఒకరిని, భయంతో మరొకరిని!