Expenditure Of Hyderabad Water Board Increasing : ఏదైనా శాఖ బిల్లులు వసూలు చేస్తున్నారంటే ఎంతో కొంత ఆదాయం సమకూరుతుంది. కానీ జలమండలిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. బిల్లులు జారీ చేయకపోతేనే నెలకు రూ.లక్ష వరకు ఆదా అవడం గమనార్హం. దీంతో బిల్లింగ్ విధానంలో మార్పులపై తర్జన భర్జన పడుతున్నారు.
అధికంగా వినియోగిస్తే బిల్లు : హైదరాబాద్లో జలమండలికి 13.5 లక్షల మంది వినియోగదారులున్నారు. వీరికి నీటి వినియోగానికి సంబంధించి ప్రతి నెలా బిల్లులు జారీ చేస్తుంటారు. మొత్తం వినియోగదారుల్లో 8.5 లక్షల మంది నెలకు 20 కేఎల్ (వేల లీటర్లు) ఉచితంగా పొందేందుకు నమోదు చేసుకున్నారు. అంతకంటే ఎక్కువ వాడితే అదనపు ఛార్జీలు వేస్తారు. ఒక కేఎల్ నీటికి అంటే ఒక వెయ్యి లీటర్ల నీటిని అదనంగా వినియోగిస్తే రూ.10 జల మండలికి చెల్లించాల్సి ఉంటుంది. 8.5 మంది ఒక కేఎల్ నీటిని అదనంగా వాడుతున్నారు. అందుకు వారు రూ.10 లేదా రూ.20ల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతుంది.
జీరో బిల్లుతో పాటు అదనంగా వాడుకున్న వాటికి ఒక్కో బిల్లును జనరేట్ చేయడానికి అదనంగా రూ.30 నుంచి రూ.40 ఖర్చువుతుంది. దీంతో ఖర్చు పెరుగుతోంది. డబ్బులు రాకున్నా బిల్లులు ఇవ్వడానికి మానవ వనరుల వినియోగంతో పాటు ఇతర వ్యయాలు బోర్డుకు భారంగా మారుతున్నాయి. పైసా కూడా రాని జలమండలికి, బిల్లుల జారీకి ప్రతి నెలా రూ.లక్షల వ్యయం చేయాల్సి వస్తోంది.
మూడు నెలలకోసారి బిల్లు : ఉచిత నీటిని వినియోగించుకుంటున్న వారికి రెండు లేదా మూడు నెలలకోసారి బిల్లులు జారీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై జలమండలి ఎండీ కె.అశోక్ రెడ్డి ఈ శాఖ రెవెన్యూ విభాగం ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్థికపరమైన అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ సమ్మర్లో వాటర్ ట్యాంకర్లే దిక్కు!
బిల్లుల వసూలుకు జలమండలి కీలక నిర్ణయం.. వారి నల్లా కనెక్షన్ కట్!