Financial Gifts For Raksha Bandhan : అన్నా చెల్లెళ్ల అనురాగం, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ రోజున చేతికి రక్షా బంధనం కట్టినందుకు సోదరికి అన్నదమ్ములు కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. అందుకే ఈ ఆగస్టు 19న నిర్వహించే రాఖీ పండుగకు ఎప్పటిలా కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక భరోసా కల్పించే కానుకను మీ సోదరికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే అనుకోని పరిస్థితుల్లో అండగా ఉండే బీమాతో మీ సోదరికి ధీమా కల్పించండి.
భవిష్యత్ కోసం
ప్రస్తుతం ఉన్న పెట్టుబడి సాధనాల్లో మ్యూచువల్‌ఫండ్స్ ఒకటి. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడిని ఇస్తాయి. అందుకే క్రమానుగత పెట్టుబడి విధానం (SIP)లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. కనుక ఈ రాఖీ పౌర్ణమి నుంచే మీ సోదరి పేరు మీద మీ ఆర్థిక శక్తిని బట్టి పెట్టుబడిని ప్రారంభించండి. ఇది ఆమెకు భవిష్యత్‌లో మంచి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్
మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ సేవింగ్ పథకంలో మీ సోదరి పేరున పొదుపు చేయండి. సాధారణ బ్యాంకులు అందించే వడ్డీ కంటే, ఈ పథకంలో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తారు. ఇలా వచ్చే రాబడి భవిష్యత్తులో మీ సోదరికి అండగా ఉంటుంది.
స్టాక్స్
ఎప్పటిలా ఏదో ఒక కానుక ఇచ్చే బదులు మంచి స్టాక్స్‌ను మీ అక్కచెల్లెళ్లకు ఇవ్వండి. మంచి కంపెనీల షేర్లపై పెట్టుబడి పెట్టి వారికి అందిస్తే, కాలక్రమేణా సంపదను పెంచుకొనే అవకాశం కల్పించిన వారవుతారు.
బంగారం, వెండి
రాఖీ పండుగ సందర్భంగా చాలా మంది తమ అక్కాచెల్లెళ్లకు బంగారాన్ని కానుకగా ఇస్తుంటారు. అది కూడా మంచి గిఫ్టే. బంగారం, వెండి లాంటివి ఇస్తే అవి శాశ్వతంగా ఉండిపోతాయి. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఈ లోహాలే వారికి అండగా నిలుస్తాయి. భౌతికంగానే కాదు, డిజిటల్ బంగారాన్ని కూడా మీరు కొని ఇవ్వవచ్చు. దీని వల్ల ఏటా మీ సోదరికి కొంత రాబడి కూడా వస్తుంది.