Personal Finance Tips : 'బడ్జెట్' అనేది దేశానికి, సంస్థలకు ఎంత ముఖ్యమో, ప్రతీ వ్యక్తికీ అంతే అవసరమవుతుంది. ప్రతీ ఒక్కరు ఒక బడ్జెట్ ప్లాన్‌ను రెడీ చేసుకోవాలి. ఆదాయం, అప్పులు, పొదుపులు, రుణాలు, ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఇది ఒక దిక్సూచిలా మన ఆర్థిక భవితకు సురక్షిత మార్గాన్ని చూపిస్తుంది. ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంతకీ పర్సనల్ ఫైనాన్స్‌కు, బడ్జెటింగ్‌కు మధ్యనున్న సంబంధం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రయోజనాలు
- ఆర్థిక క్రమశిక్షణ: బడ్జెట్‌ను ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఆదాయంలో పొదుపులు ఏమిటి? ఖర్చులు ఏమిటి? అనే దానిపై మీకు క్లారిటీ వస్తుంది. దీనివల్ల మీరు ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చుపెడతారు.
- ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది : మీ ఖర్చులేంటి అనే దానిపై మీకు ముందస్తు క్లారిటీ వస్తుంది. దీని వల్ల మీపై అంతగా ఒత్తిడి ఉండదు.
- అత్యవసర నిధిని సృష్టించండి : మీ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రతినెలా ఎమర్జెన్సీ ఫండ్‌కు తప్పక కేటాయించాలి. దీనివల్ల అత్యవసరాల్లో మీరు ఒత్తిడికి గురికావాల్సిన పరిస్థితి ఎదురుకాదు.
- ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత : ఇల్లు కొనడం, వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆర్థిక భరోసాతో పదవీ విరమణ చేయడం వంటి జీవిత లక్ష్యాలు చాలా మందికి ఉంటాయి. బడ్జెట్ తయారీ వల్ల ఈ లక్ష్యాలను సాధించే దిశగా మీరు ఎంత దూరం పయనించారు అనే దానిపై క్లారిటీ వస్తుంది.
ఖర్చులపై కమాండ్ వస్తుంది
మీ ఖర్చులు ఏమిటి? ఏయే విభాగాలపై ప్రతినెలా ఖర్చు చేస్తున్నారు? అనే అంశాలపై మీకు క్లారిటీ రావాలంటే బడ్జెట్‌ను అంచనా వేసుకోవాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు భవిష్యత్తులో తెలివైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవచ్చు. అనవసర ఖర్చులను గుర్తించి, వాటిని ఆపేసి, అదే డబ్బును రుణ చెల్లింపులు, పొదుపులు లేదా ఇతర ఆర్థిక లక్ష్యాల వైపు మళ్లించవచ్చు. ఉదాహరణకు నిత్యావసరాల కొనుగోలు, మెడిసిన్స్ కొనుగోలు వంటి ఖర్చులను మనం ఆపలేం. కానీ వాటిలో కొంత డిస్కౌంట్ వచ్చేలా చేసుకోగలం. బడ్జెటింగ్ క్రమంలో ఇలాంటి ఖర్చులను గుర్తించి వాటిపై ఫోకస్ పెంచాలి. తద్వారా మీ పొదుపులు మరింత పెరుగుతాయి. పెట్టుబడి శక్తి ఇనుమడిస్తుంది.