School Students Problems In wanaparthy : తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా స్కూళ్లకు పంపిస్తుంటారు. తాము ఒకపూట తినకపోయినా మంచిదే అనుకొని, పిల్లల చదువుకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు. కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు సదుపాయాలు కరువయ్యాయి. చదువుకోవడానికి గదులు లేక ఇరుకుగా కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది. తగిన మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పాఠశాల పక్కనే ఫ్యాక్టరీలు కట్టడం వల్ల పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడి మానిపిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇబ్బందులు : వనపర్తి మండలం చిట్యాల తూర్పుతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తగినన్ని గదులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 42 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పదేళ్ల కాలంలో 120 మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి వివిధ గురుకులాలకు ఎంపిక కావటం విశేషం.
ఒకే గదిని మూడు భాగాలుగా విభజించి పాఠాలు : ప్రస్తుతం ఒకే గదిని మూడు భాగాలుగా విభజించి అన్ని తరగతులను అందులోనే భోదిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు కూడా స్థలం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పాఠశాల భవన నిర్మాణానికి గతంలో 15 గుంటల స్థలం కేటాయించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వెదజల్లుతున్న దుమ్ముతో విద్యాలయం మూతపడే స్థితి : మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధి కొత్వాల్‌గూడ సీఆర్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చుట్టూ క్రషర్ ప్లాంట్లు, రెడీ మిక్స్ కాంక్రీట్ తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో దాంట్లో నుంచి వెదజల్లుతున్న దుమ్ము, రణగొణ ధ్వనుల కారణంగా ప్రస్తుతం ఈ విద్యాలయం మూతపడే స్థితికి చేరింది.
ఈ స్కూలు అప్పట్లో 60 మంది విద్యార్థులతో కళకళలాడేది. పాఠశాలను దుమ్ము కమ్మేస్తుండటంతో చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటోందని తల్లిదండ్రులు పంపించడం లేదు. దీంతో ప్రస్తుతం పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు మాత్రమే మిగిలి ఉన్నారు. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రోజుకు ఇద్దరు విద్యార్థుల చొప్పున వస్తున్నారని ఉపాధ్యాయుడు శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల గోడ దూకి 18 కి.మీ. పాదయాత్ర చేసిన విద్యార్థులు - ఎందుకో తెలుసా?
'నో డిటెన్షన్' విధానం రద్దు- ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్‌గా పాస్ కావాల్సిందే!