Road Accident In Hyderabad : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో కేబీఆర్ పార్కుకు ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్ పైకి థార్ కారు దూసుకెళ్లింది. ఘటనలో ఫుట్ పాత్‌పై పడుకున్న వారిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడ్డ వారికి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన కారు : ప్రమాదం జరగగానే కారులో ఉన్నవారు దిగి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్ఠలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా కారులో ఉన్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రమాదానికి మద్యం మత్తు, నిద్రమత్తు, అతివేగం కారణమా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడితో పాటు గాయపడ్డ వారు చిన్న చిన్న పనులు చేసుకోవడంతో పాటు భిక్షాటన చేస్తూ రోడ్లపైనే జీవనం సాగించేవారుగా తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో ఇదే తరహాలో రెండు ప్రమాదాలు : ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఇటీవలి కాలంలో రెండు ప్రమాదాలు ఇదే తరహాలో జరగడం గమనార్హం. ఇక ప్రమాదానికి గురైన కారు నిజామాబాద్‌కు చెందిన హర్ష వర్ధన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ ఉంది. కారుపై గజ్వేల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఒకటి, ఇందల్వాయి పీఎస్ పరిధిలో మరొకటి మొత్తం రెండు ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ కింద పోలీసులు చలాన్లను విధించారు. దీనిని బట్టి కారు అత్యంత వేగంగా నడుపుతున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా ప్రమాద బాధితుల వివరాలతో పాటు కారులో ఉన్న వారి వివరాలు తెలియనున్నాయి.
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు : ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా, వాహనదారులు పట్టించుకోకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించకూడదని, మైనర్లు కార్లు నడపకూడదని అలా నడిపితే వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదవుతాయని పోలీసులు తెలుపుతున్నారు. కారు నడిపేటప్పుడు ఓవర్ స్పీడ్, సీట్ బెల్ట్ సహా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రేణిగుంటలో కారుని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు - పటాన్‌చెరుకు చెందిన దంపతులు మృతి