New Home Buying Tips :జీవితంలో మొదటి ఇల్లు కొనడం అనేది ఎవరికైనా ఓ ముఖ్యమైన మైలురాయి. ఇంటిని పొందే ప్రక్రియకు సమగ్ర పరిశీలన, వ్యూహాత్మక ప్రణాళికలు అవసరం. తొలిసారి లేదా రెండోసారి ఓ ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు దీని కోసం అన్వేషణ చేసే క్రమంలో అనేక ఎంపికలు, న్యాయపరమైన వ్యవహారాలు, ముఖ్యంగా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటం వంటివి అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి.
సాధారణంగా కారు సహా ఏదైనా ఇతర వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత, వాటి పనీతీరు సరిగా లేకపోతే వాటిని వదిలించుకోవాలని చూస్తాం. కానీ ఇంటి విషయంలో అలా కాదు. అందుకే ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూద్దాం.
బడ్జెట్ రూపొందించుకోండి
ఇంటి కొనుగోలు చేసే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన దశ బడ్జెట్ ప్రణాళికను రూపొందించడం. ఓ ఇల్లు కొనాలని నిర్ణయించుకునే ముందు మీ ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా అంచనా వేయడం ఎంతో అవసరం. ఇంటిని కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా దాన్ని సుదీర్ఘంగా నిర్వహించడానికి ఎంత డబ్బును మీరు ఖర్చు చేయగలరో, అలాగే మీ ఆర్థిక స్థోమతను కూడా దీని కోసం పరిగణనలోకి తీసుకోవావాల్సి ఉంటుంది. ప్రతి నెల మీ ఖర్చులు కోసం ఎంత డబ్బు అడ్జెస్ట్ చేసుకోవాలి? ఈఎంఐ తీర్చడానికి ఎంత నగదు మిగిలిందో ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఓ సరైన ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఇల్లు అనేది మీ ఆదాయ బడ్జెట్‌కు లోబడి ఉండాలి. అది మీ బడ్జెట్‌కు మించకూడదు.
అవసరమైన సౌకర్యాలు ఉన్నచోటే ఇల్లు
ఇంటి నాణ్యత ఎంత ముఖ్యమో అది ఎలాంటి ప్రాంతంలో నిర్మిస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం. మీరు నివసించాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకునే ముందు మీ కుటుంబానికి అవసరమైన సౌకర్యాలను పరిగణనలోకి తీసుకోండి. ఉదాహరణకు మీ ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఉన్నత పాఠశాలలు, కళాశాలలు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నివసించడం మంచిది. మీరు ఏదైనా వృత్తి నిపుణులైతే కీలక వ్యాపార కేంద్రాలకు, నగరంలోని మిగిలిన ప్రదేశాలకు మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేస్తే ఇంకా మంచిది.
భవిష్యత్‌లో డిమాండ్ పెరిగే ప్రాంతంలో
మీ ఇంటిని కేవలం నివసించడానికి మాత్రమే కాకుండా భవిష్యత్‌లో డిమాండ్ ఉండే రియల్ ఎస్టేట్ పెట్టుబడిగా కూడా పరిగణించినట్లయితే దాని అమ్మకపు విలువ మెరుగుపరిచేందుకు అవకాశమున్న ప్రాంతాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా ప్రైమ్ లోకేషన్లలో ఇల్లు అంటే అందరి ఆర్థిక పరిస్థితి అనుకూలించలేకపోవచ్చు. అందువల్ల ముఖ్యమైన ప్రాంతాలకు, శివారు ప్రదేశాలకు మధ్యస్థంగా ఉండే ఏరియాలో ఇంటిని ఎంపిక చేసుకోవడం మంచిది.
గృహ రుణం తీసుకోవాలంటే?
మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు ప్రతి నెలా మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న వారై ఉండాలి. గృహ రుణం దీర్ఘకాలానికి సంబంధించినది కాబట్టి వయసు కూడా మధ్యస్థంగా ఉండాలి. సీనియర్ సిటిజన్ వయసు దగ్గర్లో ఉండేవారికి దాదాపు ఇంటి లోన్ లభించే అవకాశం ఉండకపోవచ్చు. రుణ అర్హత అలాగే సహేతుకమైన వడ్డీ రేటును పొందే సామర్థ్యం ఎక్కువగా మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.
డౌన్‌పేమెంట్ ఎక్కువ ఉంటే
హోమ్ లోన్ పొందటానికి రుణ మొత్తంలో 20% డౌన్ పేమెంట్ మీ వద్ద ఉండాలి. డౌన్‌పేమెంట్ కోసం ముందుగానే పొదుపును ప్రారంభించడం చాలా అవసరం. డౌన్‌పేమెంట్ శాతం ఎక్కువ ఉంటే ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. దీనివల్ల లోన్ భారం అంతగా అనిపించదు. అదనంగా డెవలపర్ విధించే ఛార్జీలు, ఇంటీరియర్లకు అయ్యే ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, అంతర్గత సంబంధిత ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.