India Foreign Exchange Reserves : భారతదేశ విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా గత మూడు నెలలుగా వాటి క్షీణత బాగా పెరిగింది. గత పద్నాలుగు వారాలు తీసుకుంటే, వాటిలో పదమూడు వారాలు విదేశీ మారక నిల్వలు క్షీణించి, దాదాపు 10 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ఆర్బీఐ డేటా ప్రకారం, జనవరి 3తో ముగిసిన వారంలో, భారతదేశ విదేశీ మారక ద్రవ్యం 5.693 బిలియన్ డాలర్లు తగ్గి 634.585 బిలియన్ డాలర్లకు చేరాయి. వాస్తవానికి 2024 సెప్టెంబర్‌లో భారత విదేశీ మారక నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 704.89 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కానీ ఆ తరువాత నుంచి క్రమంగా అవి తగ్గుతూనే వస్తున్నాయి. ఇప్పుడు భారత్ వద్ద ఉన్న ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ రిజర్వ్స్ గరిష్ఠ స్థాయి నుంచి 10 శాతానికి పైగా తగ్గాయి.
రూపాయి విలువ పతనం!
మరోవైపు దేశంలో రూపాయి విలువ పతనం అవుతోంది. ముఖ్యంగా యూఎస్ డాలర్‌తో పోల్చితే భారత రూపాయి ఇప్పుడు ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. దీనిని నిరోధించే లక్ష్యంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. దీని వల్ల విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
ఆర్బీఐ డేటా ప్రకారం, ఫారెక్స్ నిల్వల్లో అతిపెద్ద భాగమైన భారత విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏ) 545.840 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే దేశంలో ప్రస్తుతం బంగారం నిల్వలు 67.092 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత వారం ఇవి 824 మిలియన్ డాలర్ల మేర పెరిగాయి.
ఒక అంచనా ప్రకారం, ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు సుమారు ఒక సంవత్సర కాలానికి లేదా నిర్దేశిత దిగుమతులకు మాత్రమే సరిపోతాయి.
2022లో భారత్‌లో ఫారెన్ ఎక్స్ఛేంజ్ రిజర్వ్స్ 71 బిలియన్ డాలర్లకు తగ్గగా, 2023లో అవి దాదాపు 58 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024లో ఈ నిల్వలు 20 బిలియన్లకు పైగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ఆర్బీఐ ఏం చేస్తోంది?
విదేశీ మారక ద్రవ్య నిల్వల(FX Reserves)ను కేంద్ర బ్యాంక్ వద్ద ఉన్న ఆస్తులుగా పరిగణిస్తారు. భారత్ విదేశీ మారక నిల్వల్లో ప్రధానంగా అమెరికన్ డాలర్లు ఉంటాయి. వీటితోపాటు కొద్ది మొత్తంలో యూరో, జపనీస్ యెన్, పౌండ్ స్టెర్లింగ్‌లు కూడా ఉంటాయి.
ఆర్బీఐ ఎల్లప్పుడూ ఫారెన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లను నిశితంగా పర్యవేక్షిస్తుంటుంది. రూపాయి మారకపు రేట్ల అస్థిరతను అరికట్టేందుకు, అంటే రూపాయి విలువ తగ్గుదలను నివారించేందుకు, మార్కెట్లను సక్రమంగా నిర్వహించేందుకు ఆర్బీఐ కృషి చేస్తుంది.
సుమారుగా ఒక దశాబ్దం క్రితం భారత రూపాయి ఆసియాలోనే అత్యంత అస్థిరమైన కరెన్సీల్లో ఒకటిగా ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆసియాలోని అత్యంత స్థిరమైన కరెన్సీల్లో ఇండియన్ రూపాయి ఒకటిగా మారింది. రూపాయి బలంగా ఉన్నప్పుడు ఆర్బీఐ చాలా వ్యూహాత్మకంగా ఎక్కువ సంఖ్యలో డాలర్లను కొనుగోలు చేస్తుంది. అలాగే రూపాయి బలహీనపడినప్పుడు వాటిని విక్రయిస్తుంది. ఇది భారతీయ ఆస్తుల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచడంతో ఎంతో దోహదపడుతుంది.