Pension Complaints Through CPENGRAMS : ప్రభుత్వ పింఛన్లు పొందే వారికి ఏదైనా సమస్య ఎదురైతే ఫిర్యాదు చేయడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక మార్గమే ‘సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ (CPENGRAMS). పింఛనుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారాన్ని చూపించడమే ఈ విభాగం పని. CPENGRAMS అనేది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC), కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆన్‌లైన్ పోర్టల్. ఇది 24×7 అందుబాటులో ఉంటుంది. పింఛనుదారుల సమస్యలకు పరిష్కారాన్ని చూపడమే దీని ఏకైక విధి.
ఎవరు ఫిర్యాదు చేయొచ్చు?
పింఛన్‌ను పొందే క్రమంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలపై CPENGRAMS పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు. ప్రభుత్వ పెన్షనర్ లేదా పెన్షనర్ తరఫు వ్యక్తి ఈ ఫిర్యాదును నమోదు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ విభాగం గుర్తింపు పొందిన ఏదైనా పింఛనుదారుల సంఘం కూడా పింఛనుదారుల తరఫున ఫిర్యాదును సమర్పించొచ్చు.
ఫిర్యాదు చేయడానికి ఏమేం సమర్పించాలి?
CPENGRAMS పోర్టల్ ద్వారా పింఛనుదారులు ఫిర్యాదును సమర్పించడానికి కొన్ని వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుతో ముడిపడిన వివరాలతో పాటు పింఛనుదారుడి సమాచారాన్ని తప్పకుండా ఇవ్వాలి. ఫిర్యాదును బలపరిచేలా ఉన్న డాక్యుమెంట్లను పీడీఎఫ్ ఫార్మాట్‌లో జతపర్చాలి. CPENGRAMS పోర్టల్‌లో ఫిర్యాదుపత్రాన్ని నింపే క్రమంలో కొన్ని కాలమ్స్‌లో సమాచారాన్ని తప్పకుండా నింపాలి. వాటిని నింపనిదే ఫిర్యాదును మీరు సబ్మిట్ చేయలేరు.
CPENGRAMS పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం ఇలా
తొలుత CPENGRAMS పోర్టల్‌లోని హోంపేజీలోకి వెళ్లండి. అందులో "Lodge New Grievance" అనే బటన్ కనిపిస్తుంది. కొత్త ఫిర్యాదును నమోదు చేయడానికి దాన్ని క్లిక్ చేయండి.
- అక్కడ మీరు ‘ఏ రకం పింఛనుదారుడు’ అనేది సెలెక్ట్ చేసుకోండి. తదుపరిగా ‘కంటిన్యూ’ బటన్ నొక్కండి.
- ఫిర్యాదు పత్రంలో వివరాలన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా నింపేయండి. చివరగా సబ్మిట్ బటన్ నొక్కండి.
- తదుపరిగా మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబరుకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని వేరిఫై చేశాక, సబ్మిట్ బటన్ నొక్కండి.
- మీ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ పూర్తయ్యాక, ఒక రిజిస్ట్రేషన్ (ఫిర్యాదు) నంబరు మీ ఫోన్‌కు మెసేజ్‌గా అందుతుంది. ఈమెయిల్‌కు కూడా అది వస్తుంది.
ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడం ఇలా?
- CPENGRAMS పోర్టల్‌లోని హోంపేజీలో “View Grievance/Appeal Status” అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- తదుపరిగా ఓపెన్ అయ్యే పేజీలో మీ రిజిస్ట్రేషన్ (ఫిర్యాదు) నంబరు, ఫోన్ నంబరు, సెక్యూరిటీ కోడ్‌లను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. దీంతో మీరు Grievance/Appeal Statusకు సంబంధించిన పేజీలోకి ప్రవేశిస్తారు.
- అక్కడ మీ పింఛనుతో ముడిపడిన కొన్ని వివరాలను ఎంటర్ చేయగానే, ‘ఫిర్యాదు’ ప్రస్తుతం ఏ దశలో ఉందో కనిపిస్తుంది.