Congress scheme for unemployed Delhi youths : దిల్లీలో తాము అధికారంలోకి వస్తే విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. యువ ఉడాన్ యోజన కింద నిరుద్యోగులకు ఈ ఆర్థిక సాయం చేయడమే కాకుండాగ, వారి నైపుణ్యాలకు అనుగుణంగా కంపెనీళ్లో పనిచేసేలా చేస్తామని చెప్పింది. అయితే ఇది ఇంట్లో కూర్చినే వారికి కాదని, వారి నైపుణ్యాలు ప్రదర్శించినవారికి డబ్బులు ఇస్తామని తెలిపింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ ఆదివారం ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులు వారి శిక్షణ పొందిన రంగంలో పనిలో చేరేలా ప్రయత్నిస్తామన్నారు. తద్వారా వారు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలరని సచిన్ పైలట్ అన్నారు.
ఇప్పటికే పలు జానాకర్షణ పథకాలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్యారీ దీదీ యోజన కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని జనవరి 8న హామీ ఇచ్చింది. 'జీవన్ రక్షా యోజన' కింద రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా, 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న దిల్లీలో పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కింపు ఉంటుంది.
పోటాపోటీగా ఉచితాలు
అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ ఇలా ఉచితాలను పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన్ పేరుతో మహిళలకు రూ.2100 ఆర్థిక సహాయాన్ని అందించే కొత్త పథకాన్ని తీసుకొస్తామని మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వృద్ధులకు ఉచిత వైద్యం కోసం 'సంజీవని యోజన' అమలు చేస్తామన్నారు. సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు నివాస సంక్షేమ సంఘాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తామని కేజ్రీవాల్ హామీలు గుప్పించారు.
కాంగ్రెస్, ఆప్ దారిలోనే బీజేపీ కూడా పలు ఉచితాలు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, ఇళ్లకు 300 యూనిట్లు, ప్రార్థనా స్థలాలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ప్రతిపాదనలు కాషాయ పార్టీ తమ మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు సమాచారం.